హైదరాబాద్, ఆంధ్రప్రభ: స్వరాష్ట్రంలో విద్యరంగం వికసించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలను కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తిగడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 978 గురుకుల పాఠశాలలో 5 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.1లక్షా 25 వేలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. అన్ని రకాల విద్యాలయాల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నది. ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చనున్నది. రాష్ట్రంలోని పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించింది. మోడల్ స్కూళ్లను అభివృద్ధి చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజన, మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోఠి ఉమెన్స్ కాలేజీను మహిళా యూనవర్సిటీగా తెలంగాణ ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. మహిళా వర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అర్హులైన విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం అందజేస్తోంది. యూనివ్సిటీలను అభివృద్ధిపరిచేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ఆంగ్ల మాద్యమం…
2022-23 సంవత్సరం నుండి 1 నుండి 8వ తరగతుల్లో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత 9, 10 తరగతులలో దీన్ని అమలు చేయనున్నారు.ఆంగ్ల మాద్యమంలో భోధించే ఉపాధ్యాయులు ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పెంపొందిచడానికి అజీమ్ ప్రేమ్‌జీ విశ్విద్యాలయం(ఏపీయు) సహకారంతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల అందరికోసం ఎస్‌ఈఆర్‌టీ, ఏపీయుల 9 వారాల ఆంగ్ల భాషా ఎన్‌రిచ్‌మెంట్ కోర్సును సైతం రూపొందించింది.
జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య…
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015-16 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత విద్యను ప్రవేశపెట్టి, ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీని కారణంగా గత 5 సంవత్సరాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా 30 శాతం పెరిగింది. 2021-22లో దాదాపు తొమ్మది లక్షల మందికిపైగా విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. పరిశ్రమలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా 2017-18 విద్య సంవత్సరం నుండి ఫార్మా టెక్నాలజీ, టూరిజం అండ్ హాస్పాలిటీ మేనేజ్‌మెంట్ కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది నుంచి మరికొన్ని నూతన కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. నీట్, ఎంసెట్, జేఈఈ ప్రవేశపరీక్షలకు ఆన్‌లైన్ కోచింగ్‌ను ఇస్తున్నారు. 2016-17 నుంచి యూజీ కోర్సుల్లో ప్రవేశాలను డోస్త్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవేశాలను చేపడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు భారీగా నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నాటికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1,39,657 సీట్లు భర్తీ అయ్యాయి. గత మూడేళ్ల కాలంలో 64 శాతం డిగ్రీ కాలేజీలు పెరిగాయి. నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
సాంకేతిక, ఉన్నత విద్య…
తెలంగాణ ప్రభుత్వ ఒకేసారి రెండు వర్సిటీలను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. అందులో ఒకటి మహిళా వర్సిటీకాగా, మరోకటి ఫారెస్ట్ వర్సిటీ. ఉన్నత విద్యలో ఇదోక గొప్పమైలురాయి. ఫారెస్ట్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిది. తెలంగాణ ఉన్నత విద్యామండలి సిరిసిల్ల, వనపర్తిలో జేఎన్‌టీయు కాలేజీలను ప్రారంభించింది. విశ్వవిద్యాలయాల స్థాయి సంస్థలను న్యాక్ అక్రిడడిటేషన్‌ను చురుకుగా ప్రోత్సహిస్తోంది. న్యాక్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంది. క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. కామన్ పీజీ ఎంట్రెన్స్‌ను నిర్వహిచంనుంది. వర్సిటీల్లోని టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాల స్థాయిలో 65 శాతం మంది మహిళా విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ స్థాయిలో ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులను తెలంగాణ ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తేనుంది. ఇందుకు అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజనీరింగ్ స్థాయిలో మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తో పాటు ఇతర కంప్యూటర్ సంబంధిత కోర్సులను తీసుకొస్తున్నారు.