Tuesday, November 26, 2024

Education: గీతం వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం.. నోటిఫికేషన్‌ జారీచేసిన వీసీ శివప్రసాద్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:గీతం ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్‌ను గీతం డీమ్డ్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు క్యాంపస్‌లలో వచ్చే విద్యా సంవత్సరానికి ఈమేరకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022, -23 విద్యా సంవత్సరం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, హ్యూమానిటీస్‌, పబ్లిక్‌ పాలసీ వంటి తదితర కోర్సులను గీతం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. గీతం ప్రవేశ పరీక్ష (గ్యాట్‌-2022) దరఖాస్తులను గీతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, వాటిని ఆన్‌లైన్‌లోనే నేరుగా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు.

గీతం ప్రవేశ పరీక్షతో పాటు జేఈఈ మెయిన్‌, ఏపీ ఈఏపీసెట్‌, తెలంగాణ ఎంసెట్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అర్హులైన విద్యార్థులకు ఆకర్షణీయమైన స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పారు. అయితే గీతం ప్రవేశ పరీక్షను ఇంటి వద్ద నుంచే రాసేలా అవకాశాన్ని కల్పించామని, ఇది దశలవారీగా నిర్వహిస్తామన్నారు. 200 మార్కులకు గానూ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష తేదీకి ఒక రోజు ముందు అభ్యర్థి రిజిస్టర్‌ ఈ-మెయిల్‌తో పాటు మొబైల్‌ నంబర్‌కు పంపుతామని తెలిపారు. ఈ పరీక్షలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు. గీతం అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డా.సీ.ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ తొలి ఏడాది స్కాలర్‌షిప్‌లు పొందినవారు ఆ తర్వాతి సంవత్సరాలలో 8.0 అంత కంటే ఎక్కువ సీజీపీఏ సాధిస్తేనే ఫీజులో రాయితీ కొనసాగుతోందన్నారు. ప్రవేశాల ప్రక్రియ వివరాల కోసం గీతం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో గీతం-హైదరాబాద్‌ రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, అడ్మిషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement