హైదరాబాద్, ఆంధ్రప్రభ : లైగర్ సినిమాకు పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలపై సినీ నటుడు విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ మేరకు బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్దినెలల క్రితం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. గతంలో ఈడీ విచారణకు లైగర్ సినిమా చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి హాజరయ్యారు. తాజాగా హీరో విజయ్‌ను కూడా ఈడీ విచారించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ‘సాయంత్రం చీకటి పడేవరకు విచారణ కొనసాగింది.
విజయ్‌కు సంబంధించిన రెండు బ్యాంకు అకౌంట్ల లావాదేవీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. లైగర్ సినిమా చిత్ర సంస్థ ఎంత పారితోషకం ఇచ్చిందన్న అంశాలపై ఈడీ కూపీ లాగినట్లు సమాచారం. లైగర్ సినిమాకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి..? అన్న అంశాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో లైగర్ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. లైగర్ సినిమా బడ్జెట్‌కు సమకూరిన నిధులపై ఈడీ ఆరా తీసింది. సినిమా కోసం విదేశాల నుంచి పెట్టుబడుల విషయంలోనూ విజయ్‌ని ఈడీ ప్రశ్నించింది. లైగర్ సినిమాకు సంబంధించిన లావాదేవీలపై వివరాలు సేకరించింది. హీరో విజయ్ దేవరకొండతోపాటు మేనేజర్ అనురాగ్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది.