సామాజిక కార్యకర్తలు, విప్లవ రచయితలు, ఉద్యమకారులు అయిన కొంతమంది మేధావులను జైల్లోనే మగ్గిపోయేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎల్గర్ పరిషత్ కేసును ఏండ్ల కొద్దీ ఎటూ తేల్చకుండా నాన్చుతూ వస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. తొలుత చిన్న కేసు అనుకున్న దాన్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధీనంలోకి తీసుకుని దేశ భద్రతను ముడిపెట్టింది. ఈ కేసులో సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతూ.. హెల్త్ ఇష్యూస్‌తో ఆరోగ్యం దెబ్బతిని, వృద్ధాప్యంతో కనీసం సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారిపై ఇప్పుడు కేంద్రం మరో కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ ఇవ్వాల వెల్లడించింది.
అసలు కేసు ఏంటంటే..
భీమా కోరెగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనేక మంది సామాజిక కార్యకర్తలు, నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పుణే పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఆ తరువాత ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ అయ్యింది. కాగా, కొత్తగా మనీలాండరింగ్ కోణంలో కూడా ఆర్థిక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 2018 జనవరి 1న పూణేలోని కోరేగావ్ గ్రామంలో విజయ్ స్తంభ్‌కు నివాళులర్పించేందుకు భీమా కోరేగావ్‌కు కొంతమంది వ్యక్తులు వెళుతుండగా ఘర్షణలు జరిగాయి.
ఆ ఘర్షణల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య నెలకొంది. 2018, జనవరి 1న పూణేలోని శనివార్‌వాడలో జరిగిన ఎల్‌గార్ పరిషత్ కార్యక్రమంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా మరొక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని పోలీసులకు అదే ఏడాది జనవరి 8న ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా జూన్‌లో సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, షోమా సేన్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్ వంటి సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక.. అదే ఏడాది ఆగస్ట్ లో నిషేధిత విప్లవ గ్రూపులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరుణ్ ఫెరీరా, వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లాఖా, వెర్నాన్ గోన్సాల్వేస్‌తో సహా మరికొంతమంది ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు.
కాగా, పూణే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసి 2020లో ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. NIA 10వేల పేజీల ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. అరెస్టయిన నిందితులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని యోచిస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కొన్ని పేపర్లను పూణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుకు సంబంధించిన పేపర్లు, కమ్యూనికేషన్‌లు కూడా ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడ్డట్టు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.