దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు.. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై మరో కొత్త కేసు నమోదైంది. ముంబైలో బలవంతంగా భూమిని ఆక్రమించిన మరో కేసులో విచారిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. నవాబ్ మాలిక్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు బలవంతంగా ఆక్రమించుకున్న భూమిని ED గుర్తించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ భూమిని లాభార్జన కోసం డెవలప్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కేసులో అసలు యజమాని, ఫిర్యాదుదారు తన భూమికి పరిహారం చెల్లించలేదని తెలుస్తోంది. ఈ కొత్త కేసులో ఈడీ కొన్ని వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. నవాబ్ మాలిక్ సూచనల మేరకు తన భూమిని బలవంతంగా కొంతమంది వ్యక్తులు లాక్కున్నారని, ఆ తర్వాత వాణిజ్య అవసరాల కోసం అభివృద్ధి చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఫిబ్రవరి 23న నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ED అరెస్టు చేసింది. ముంబైలోని సబర్బన్ కుర్లాలో డి-గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు మాలిక్ ఒక స్థలాన్ని అక్రమంగా కొనుగోలు చేసినట్లు ED ఆరోపించింది. దావూద్ సహాయకులకు కూడా మాలిక్ నిధులు సమకూర్చినట్లు ఆ సంస్థ ఆరోపించింది.