నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లీ కొడుకులు సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, తదుపరి దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా పన్నెండు నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈడీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, కేంద్రప్రభుత్వానిది ప్రతీకార రాజకీయాలని విమర్శించింది. ఈడీ దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు భారీస్థాయిలో ఆందోళన నిర్వహించారు. ఈనెల 5న ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందుకే, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మనీల్యాండరింగ్ కేసులో విచారించిన ఈడీ, మంగళవారం ఢిల్లిdతో సహా పన్నెండు ప్రాంతాల్లోని నేషనల్ హెరాల్డ్ పత్రికా కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) క్రిమినల్ సెక్షన్ల ఆధారంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీల విచారణకు సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి ఈ ట్రయల్ రైడ్స్ చేసినట్లు ఈడీ అధికారిక వర్గాల సమాచారం. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయని, భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి 2013లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్)కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీల్యాండరింగ్ జరిగిందని, ఈ సంస్థను సోనియా, రాహుల్ గాంధీలు మేజర్ షేర్లు కలిగి ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం జరిగిందని స్వామి ఆరోపించారు. రూ. 50 లక్షల పెట్టుబడితో గాంధీలు రూ. 90.25కోట్ల ఏజెఎల్ ను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతీకార రాజకీయాలపై కాంగ్రెస్ ఆగ్రహం
నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా వేధింపులకు గురి చేయడంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసును ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాంరమేష్ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై ప్రతీకార ధోరణితో దాడులు చేస్తోందని, కానీ కాంగ్రెస్ పార్టీ భయపడదని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మౌనంగా ఉండదని జైరాంరమేష్ ట్వీట్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ ఎదుట కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కార్యాలయాల్లో ఈడీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యర్తలు ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ దాడులు చేస్తోందన్న సమాచారం అందుకున్న వెంటనే, సెంట్రల్ ఢిల్లిdలోని బహదూర్ షా జఫార్ మార్గ్ లో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, ఈడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లనే సోనియా, రాహుల్ గాంధీలను వేధించి, బ్లాక్ మెయిల్‌కు దిగుతోందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీకార రాజకీయాలు కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే కాదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలపై సైతం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వేధింపులకే పాల్పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అణచివేతను, ప్రతీకార రాజకీయాలపై గ్రాండ్ ఓల్డ్ పార్టీ తగ్గేదే లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.