తెలంగాణకు చెందిన ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని చైర్మన్ సీఏ అజార్, ఇతరులపై ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవ్వాల కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. సంస్థకు చెందిన రూ. 66.30 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 కింద రూ.1500 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ కింద ఈ చర్యలు తీసకున్నట్టు తెలిపింది. ఇదంతా మార్కెటింగ్ స్కామ్ అని అధికారులు చెప్పారు. తెలంగాణ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ అక్రమ పిరమిడ్ తరహా నిర్మాణాన్ని కలిగి ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్‌కు పాల్పడిందని, డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ముసుగులో పనిచేస్తోందని కంపెనీ పెద్ద సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లను ఇన్వాల్వ్ చేసిందని ఆరోపించారు.
సంస్థ యొక్క కమీషన్ స్కీమ్‌ల గురించి పెద్ద ఎత్తున ప్రాచారం చేశారని, సభ్యత్వం తీసుకోవడం ద్వారా త్వరగా, ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం ఉందని మాయ మాటలు చెప్పారన్నారు. అలా పిరమిడ్ విధానంలో కుడి, ఎడమల సభ్యులను చేర్పించడం ద్వారా మరింత మనీ సంపాదించుకోవచ్చని బైనరీ పద్ధతిలో యాడ్ చేసుకున్నట్టు తెలిపారు. “తమ మోసపూరిత పిరమిడ్ స్కీమ్‌ను చట్టబద్ధమైన వ్యాపారంగా అంచనా వేయడానికి, వారు కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. అవి అమ్మకాల ఆదాయంలో 20% మాత్రమే విలువైనవి. వాస్తవానికి పూర్తిగా పనికిరానివి” అని తమ విచారణలో వెల్లడైనట్టు ED తెలిపింది.
కొత్త క్లయింట్లు చెల్లించే సభ్యత్వ రుసుము పాత ఖాతాదారులకు కమీషన్ చెల్లించేదని, తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత మాటలతో కంపెనీ దాదాపు 10 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. దాని ప్రారంభం నుండి సుమారు రూ. 1,500 కోట్లు వసూలు చేసిందని అని ED తెలిపింది. CA అంజార్ (ఇండస్ వివా చైర్మన్), అభిలాష్ థామస్ (ఇండస్ వివా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) నిధులను అనుబంధ కంపెనీలు, వాటికి సంబంధించిన ఇతర కంపెనీలకు.. వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని ED ఆరోపించింది. ‘‘కంపెనీలు, వ్యక్తుల పేరిట రూ. 50.47 కోట్ల మేరకు స్థిరాస్తులను సంపాదించేందుకు ఈ నిధులను వినియోగించారు. ఇంకా, ఇండస్ వివా, దాని ఛైర్మన్, సంబంధిత కంపెనీలకు చెందిన 20 బ్యాంకు ఖాతాల్లో రూ.15.83 కోట్ల విలువైన చరాస్తులను బ్యాంకు నిల్వల రూపంలో గుర్తించారు. ఈ ఆస్తులన్నీ ED ద్వారా తాత్కాలికంగా అటాచ్ చేయబడ్డాయి” అని ED పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన CA అంజర్, అభిలాష్ థామస్‌లను ED అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.