పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తరువాత.. రాష్ట్రపతి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సరేను లోక్‌సభలో సమర్పించారు. ఆ తరువాత.. లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆర్థిక సరే ప్రకారం.. 2022-23లో జీడీపీ వృద్ధి (ఆర్థిక వృద్ధి రేటు) 8-8.5 శాతంగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2 శాతంగా నమోదవొచ్చని సర్వే తెలిపింది.
దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి తిరిగి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా.. అతి తక్కువగా ప్రభావితమైందని సర్వే చెబుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 3.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7.0 శాతం వృద్ధి ఉండొచ్చని సర్వే తెలిపింది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువే..
కరోనా రెండో వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. మూడో వచ్చినప్పటికీ.. భారత్‌లో వినియోగ శక్తిపై ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా సేవా రంగంపై అధిక ప్రభావం పడినట్టు వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కరోనా ముందు స్థాయికి చేరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా సమయంలోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఇందుకు కారణం ప్రభుతం సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే అని ఆర్థిక సరే వెల్లడించింది. ఓ వైపు కరోనా మహమ్మారి అరికట్టే చర్యలు.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మద్దతు చర్యలు కేంద్ర ప్రభుతం చేపట్టిందని తెలిపింది. కరోనా సమయంలో కేంద్రం చర్యలు గత ఆర్థిక సరేలోనే చర్చించినట్టు గుర్తు చేసింది. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరో ముఖ్య కారణం డిమాండ్ నిర్వహణపై పూర్తిగా ఆధారపడకుండా.. సరఫరా సంస్కరణల వైపు దృష్టి సారించిందని ఆర్థిక సర్వే తెలిపింది. సరఫరా వైపు సంస్కరణల్లో భాగంగా.. అనేక రంగాల నియంత్రణ సడలింపు, ప్రక్రియల సరళీకరణ, రెట్రోస్పెటివ్ ట్యాక్స్ వంటి సమస్యల తొలగింపు, ప్రైవేటీకరణ, ఉత్పత్తి, సంబంధిత ప్రోత్సాహకాలు మొదలైనవి ఉన్నట్టు తెలిపింది.
ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్య
ప్రభుత్వ మూలధన వ్యయంలో భారీ పెరుగుదల కూడా డిమాండ్, సరఫరాను మెరుగుపర్చిన దానికి ప్రతిఫలంగా చూడొచ్చని సర్వే తెలిపింది. ఇది భవిష్యత్తులో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్యగా కనిపిస్తోందని పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఉంటుందని, ఇలాంటి దిగుమతి ద్రవ్యోల్బణం పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సర్వే పేర్కొంది. వివిధ రంగాల స్థితితో పాటు వృద్ధిని వేగవంతం చేయడానికి సంస్కరణలను కూడా ఈ సర్వే సూచించింది. భారత్ ఆర్థిక వ్యవస్థ స్థితిని మెరుగుపర్చేందుకు సరఫరా, సమస్యల వైపు దృష్టి సారించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుంచి 6.5 శాతం అంచనా వేయగా.. మైనస్ 7.3 శాతంగా నమోదైంది.
నష్టాల తగ్గింపు ప్రధాన లక్ష్యం
పెరిగిన ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఖర్చు తగ్గింపు, నష్టాలను తగ్గించడం, మార్కెట్ అభివృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ పరిస్థితులకు క్రమబద్ధంగా నిర్వహించడానికి సంప్రదాయ, అసాధారణమైన చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. చిప్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపించిందని తెలిపింది. సెమీ కండక్టర్ల తయారీకి పెద్ద మొత్తంలో మూలధనం అవసరమని పేర్కొంది. చైన్ సప్లయి అంతరాయాల నుంచి రికవరీ నెమ్మదిగా కనిపిస్తోందని పేర్కొంది. గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంతో బలమైన వృద్ధి సాధిస్తుందని, కరోనా ముందు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. కాపెక్స్, మౌలిక సదుపాయాలకు ఖర్చుల ద్వారా ఆర్థిక వ్యవస్థలో మూలధనాన్ని పెంచిందని, 2021-22లో పెట్టుబడులను జీడీపీ నిష్పత్తికి దాదాపు పెంచిందని, గత ఏడేళ్లలో ఇది అత్యధికమని తెలిపింది.
2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు
2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే.. మౌలిక రంగంలో 1.4 ట్రిలియన్ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. 2008-17 మధ్య కాలంలో మొత్తం 1.1 ట్రిలియన్ డాలర్లను మౌలిక రంగంలో పెట్టినట్టు సర్వే పేర్కొంది. 2020-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యంతో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కేంద్రం ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ప్రైవేటీకరణను వేగవంతం చేయడానికి ఎయిరిండియా విక్రయం ఊతం ఇచ్చిందని అభిప్రాయపడింది. ఐపీఓలు భారీగా వచ్చాయి. 2021 ఏప్రిల్-నవంబర్ మధ్య 75 కంపెనీలు ఐపీఓకి వచ్చి రూ.89,066 కోట్లు సమీకరించాయని వివరించింది. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పుంజుకుంది. ఫార్మా రంగంలో విదేశీ పెట్టుబడులు పోటెత్తాయి.
రహదారుల నిర్మాణంలో వేగం
ఆత్మ నిర్భర్ భారత్‌ను కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్, కోర్ కాంపిటెన్సీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో పెట్టుబడులను ఆకర్శించేందుకు రూపొందించిన వివిధ పీఎల్‌ఐ స్కీమ్స్, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుతో సహా ఆత్మ నిర్భర్ భారత్ కింద కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేసింది. 2021 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.4 శాతానికి తగ్గింది.జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుందని సర్వే తెలిపింది. 2013-14 నుంచి రహదారుల నిర్మాణంలో వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది. 2020-21లో 13,327 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. 2019-20లో ఇది 10,237 కి.మీ ఉందని తెలిపింది.