న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆలోచనాధోరణి మారుతోంది. నా ఊరు.. నా ప్రాంతం.. నాదేశం అన్న ఆలోచనలు చెరిగిపోతున్నాయి. జీవితానికి, ఆస్తులకు తగిన భద్రతతో పాటు సుఖవంతమైన జీవనానికి పెద్దపీటేస్తున్నారు. అందుకు భరోసానిచ్చే దేశాలకు తరలిపోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ పరిస్థితికి పాలకులే కారణం. కొన్ని డజన్ల మంది దూరదృష్టి లోపంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా దేశాల్లోని కోట్లాదిమంది జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అసమర్ధ రాజకీయాలు, కక్ష సాధింపులు, యుద్దాలపై వ్యామో హం, ఆచరణ సాధ్యం కాని ఆర్ధిక విధానాలు, అధికారాన్ని దృడపర్చుకునే కుట్రలు దేశాన్ని అధోగతిపాల్జేస్తున్నాయి. ఇప్పటికే డజన్ల సంఖ్యలో దేశాలు ఆర్ధికంగా దివాళా తీశాయి. కొన్ని మాసాల క్రితమే శ్రీలంక దివాళా ప్రకటిం చింది. కాగా ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఆర్ధిక దివాళా తీసినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 39శాతానికి తాకింది. డాలర్‌తో పోలిస్తే ఆ దేశ మారకమైన రుపీ విలువ 272లకు చేరుకుంది. ఆ దేశ స్థూల జాతీయో త్పత్తికంటే విదేశీ రుణభారం పెరిగింది. వార్షిక రాబడిలో 50శాతానికి పైగా విదేశీ రుణాలపై వడ్డీలుగా చెల్లించాల్సొస్తోంది. మరో 27శాతం అక్కడి సైనిక బలగాలపై వ్యయమౌతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటర్ 272కు చేరింది. డీజిల్ 262, కిరోసిన్ 217లకు విక్రయిస్తున్నారు. గ్యాస్ సిలెండర్ ధర 1800లకు పెరిగింది. చికెన్ కిలో 780 నుంచి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. పాల ధర లీటర్ 210పలుకుతోంది. గోధుమల ు, నూనెలు, నిత్యావసరాల ధరలన్నీ అనూహ్యంగా పెరిగాయి. ప్రజల కొనుగోలు శక్తి గత మూడేళ్ళలోనే 79శాతం పడిపోయింది. ఈ దశలో ప్రభుత్వం 170బిలియన్ల సేకరణకు అదనపు పన్నులు విధించడంతో జనజీవనం పూర్తిగా కుదేలైంది.
రాజకీయ అస్థిరత :
పాక్ రాజకీయాలు ప్రధానంగా భారత్ చుట్టూ పరిభ్రమిస్తాయి. భారత్‌తో శత్రుత్వాన్ని పెంచేందుకే పాక్ పాలకులు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. పాక్ ప్రజలకు భారత్‌ను ఓ బూచిగా చూపిస్తారు. ఏమరుపాటుగా ఉంటే భారత్‌నుంచి దాడులు తప్పవంటూ ప్రజల్ని భ్రమల్లో పెడతారు. ఈ సాకుతో సైన్యానికి అత్యధిక అధికారాలు కల్పిస్తారు. సైన్యం ఆసరాతో అధికారాన్ని చెలాయిస్తాయి. ఏనాడూ పాక్ స్వచ్ఛమైన ఆర్ధిక తర్కాన్ని అనుసరించలేదు. ఓటుబ్యాంక్ రాజకీయాలకే ఆ దేశ రాజకీయ పార్టీలు పరిమితమయ్యాయి. ఈ కారణంగానే పాక్‌లో ప్రభుత్వాలు అస్థిరంగా ఉంటాయి. ఆవిర్భావం నుంచి పాక్ భారత్‌కు విరుద్దంగా స్వాభావిక మత పర ఛాందస వాద సంస్కృతికి కట్టుబడింది. ప్రాచీన సంప్రదాయాల సంకెళ్ళను తెచ్చేందుకు ఆ దేశ పాలకులెప్పుడూ ప్రయత్నించలేదు. ప్రజల మధ్య ఛాందస వాదాన్ని పెంచి విభజనల్ని సృష్టించేందుకు పాలకులు ప్రయత్నించారు. ఇదే దేశంలో అంతర్యుద్దాలకు దారితీసింది. తరచూ ప్రభుత్వాలు ఆర్ధిక అస్థిరతకు లోనయ్యాయి. దీన్ని సాకుగా చూపి సైన్యం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటుంది. దేశంలో హింస, ఆకలి, తీవ్రవాదాలు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. స్వదేశీ ఉగ్రవాద సంస్థలు పాక్‌లో అధికారం కోసం పోటీపడుతుంటాయి. వాటి మద్దతున్న పార్టీలే అధికారంలోకొస్తుంటాయి. ప్రజల్ని ఉత్పాధకత వైపు కాకుండా సోమరిపోతుల్లా తయారు చేస్తాయి. విదేశీ రుణాల్తో దేశంలో సబ్సిడీ పథకాలు అమలు చేస్తాయి. జనాధరణ కోసం గతి తప్పిన ఆర్ధిక విధానాల్ని అనుసరిస్తాయి. యుద్దోన్మాదం పాక్‌ను పేదరికంలో నెట్టేసింది. భారత్‌తో చేసిన నాలుగు యుద్దాల కారణంగా పాకిస్థాన్ సుమారు 30ట్రిలియన్ డాలర్ల విలువైన నష్టాల్ని చవిచూసింది. దీంతో అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం వద్ద నయాపైసా మిగల్లేదు. ఈ యుద్దోన్మాదం పాకిస్థాన్ ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చేసింది. దీంతో ఇప్పుడు పాక్‌లో సాధారణ ప్రజల్లో దేశ విభజన నాటి పరిస్థితులపై సింహావలోకనం మొదలైంది. పాలకుల అప్పటి తప్పుడు నిర్ణయమే ప్రస్తుత తరం తమ దురావస్థకు కారణమన్న ఆగ్రహం వ్యక్తమౌతోంది. దాయాది దేశం భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్తో అన్నింటా పోటీపడుతోంది. ఆర్ధిక వ్యవస్థలో దూసుకుపోతోంది. కాగా తాము మాత్రం అర్ధాకలితో అమలటించేందుకు దేశంలోని రాజకీయ పరిస్థితులే కారణమన్న ఆగ్రహం ఇప్పుడు సాధారణ పాకిస్థానీల్లో వెల్లువెత్తుతోంది. మహ్మద్ అలీ జిన్నా స్వార్ధ రాజకీయ క్రీడకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం కూడా మద్దతు పలికింది. దేశ విభజనకు సమ్మతించింది. అఖండ భారత్‌ను విడదీసిన అనంతరమే స్వతంత్య్రం ప్రకటించాలని అప్పటి బ్రిటన్ ప్రభుత్వ ఆలోచనకు భారత రాజకీయ నాయకుల సహకారం తోడైంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత హ ృదయ విదారక సంఘటనలు దేశ విభజన సమయంలో చోటు చేసుకున్నాయి. ఇస్లాం పేరిట పాకిస్థాన్ ఆవిర్భవించింది. మత ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. దాయాది భారత్ పై పగతో రగిలిపోయింది. తరచూ భారత్‌పై కాలుదువ్వింది. భారత్‌ను అన్ని విధాలా నాశనం చేయాలని కుట్రలు సాగించింది. కాశ్మీర్ విషయంలో ఆరని అగ్నిజ్వాలలను ఎగదోసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చింది. ఉగ్రవాదులకు శిక్షణా కేంద్రంగా మారింది. ఈ క్రమంలో రక్షణ వ్యయాన్ని అనూహ్యంగా పెంచింది. భారత్‌తో పోటీగా అణ్వాయుధాల్ని కూడా సమకూర్చుకుంది. దేశీయ ప్రగతి, అభివృద్దిలను పాక్ పాలకులు పక్కనపెట్టారు. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారత్‌ను బ ూచిగా చూపడం మొదలెట్టారు. సైన్యానికి అపరిమిత అధికారాల్ని కట్టబెట్టారు. దేశంలో పరిశ్రమలు, వాణిజ్య విస్తరణలకంటూ సైనిక పరికరాలు, ఆయుధాల సముపార్జనకు ఎక్కువ వ్యయం చేశారు. దీంతో దేశంలో ఉపాధి అవకాశాలు దిగజారిపోయాయి. ఆర్ధిక పరిస్థితి మందగించింది. ఈ పరిస్థితుల్లో సహకరించేందుకు ముందుకొచ్చిన చైనాతో దోస్తీ చేశారు. చైనా ఆర్ధిక ఆంక్షలకు తలొగ్గారు. అదే పాకిస్థాన్‌ను ప్రస్తుత దుస్థితికి దిగజార్చిందంటూ ఆదేశ ప్రజలు మండిపతున్నారు. అదే అఖండ భారత్ విభజన జరిగుండకపోతే తామంతా భారతీయులుగానే కొనసాగుండేవారమన్న భావం ఇప్పుడు వారిలో ప్రస్పుటిస్తోంది. భారతీయుల తరహాలోనే తాము కూడా ప్రపంచ వేదికలపై సగర్వంగా సమోన్నతంగా నిలబడుండేవారమన్న ఆలోచనలు వ్యక్తమౌతున్నాయి.
ప్రస్తుత దుస్థితికి రెండు కారణాలు :
పాకిస్థాన్ దివాళాకు అంతర్జాతీయ నిపుణులు రెండు ప్రధాన కారణాల్ని నిర్దేశిస్తున్నారు. వాటిలో మొదటిది విపరీతమైన రక్షణ వ్యయం. పాక్ తన ఆర్ధిక పరిస్థితికి మించి అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల తయారీపై ఎక్కువగా ఖర్చు చేసింది. రక్షణ పరంగా భారత్‌తో వ్యూహాత్మక సమానత్వం కోసం పోటీపడింది. అయితే ఆదాయంలో మాత్రం భారత్‌తో పాక్ ఏనాడూ సరిసమానం కాదు. ఈకారణంగా పాక్ భారీగా అప్పులు చేసింది. ఇప్పుడు ఆ అప్పులన్నీ తడిచిమోపెడయ్యాయి. వీటిపై వడ్డీలకే పాక్ తన వార్షిక ఆదాయంలో సగ భాగాన్ని కేటాయించాల్సొస్తోంది. కాగా ఈ దుస్థితికి రెండో కారణం చైనా ఆర్ధికమత్తుకు పాకిస్థాన్ బానిస కావడం. చైనా దేశం పాక్ ఆర్ధిక బలహీనతల్ని గుర్తించి ంది. ఆ దేశం మీదుగా భారత్ తలకట్టు వెంట చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మించింది. ఇందుకోసం పాక్ అడిగిన మొత్తాన్ని ఎకాఎకిన అందించింది. ఇలా భారత్‌పై అక్కసుతో చైనా పాకిస్థాన్‌కు ఆర్ధికంగా సహకరించింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక స్థావరాల ఏర్పాటుకనువైన మౌలికసదుపాయాల్ని పాకిస్థాన్‌లో పెంచింది. అయితే వీటి నిర్మాణ వ్యయాన్ని చైనా రుణంగా మాత్రమే పాకిస్థాన్కందించింది. ఈ రుణాల్ని కూడా పాకిస్థాన్ ఎంతో ఆనందంగా ఆహ్వానించింది. అప్పటికప్పుడు ఈ సొమ్ముతో సోకులు చేసింది. కాగా చైనా ఆర్ధిక మత్తు పాకిస్థాన్ జాతీయ ఆర్ధిక భద్రతకు విపత్తుగా మారుతుందని ఆనాడు పాక్ పాలకులు గుర్తించలేదు. ఇప్పుడు చైనా పాకిస్థాన్‌ను అప్పు ఉచ్చులో బిగించింది. ఆ దేశంపై వ్యూహాత్మక పట్టు సాధించింది. రెండేళ్ళ క్రితం కూడా పాక్ ఆర్ధిక కష్టాల్నుంచి బయటపడేందుకు చైనా ఆర్ధికంగా సహకరించింది. కానీ ఇప్పుడు రూపాయి అప్పిచ్చేందుక్కూడా చైనా అంగీకరించడంలేదు. పైగా ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికందించిన రుణాన్ని వెంటనే చెల్లించమంటూ ఒత్తిడి తెస్తోంది. పాక్ దివాళా తీయడంతో ఆ దేశంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల కేంద్రాల్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. రుణాలకు బదులుగా చైనా వీటిపై యాజమాన్య హక్కులను తనకు దఖలు పర్చాలంటూ ఒత్తిళ్ళు మొదలెట్టింది. గతంలో శ్రీలంక విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించింది. ఆ తర్వాతే శ్రీలంక ఆర్ధికంగా దివాళా తీసింది. వాస్తవానికి చైనా-పాక్‌ల మధ్య ఏనాడూ సత్సంబంధాల్లేవు. పాక్‌ను స్వావలంభన కలిగిన ఓ సుస్థిర దేశంగా చూడాలన్న ఉదారవాద ధోరణి చైనాకేనాడూ లేదు. కానీ భారత్‌తో పాకిస్థాన్‌కున్న శత్రుత్వం నేపధ్యంలో పాక్‌కు చైనా ఆర్ధిక వెన్నుదన్నుగా నిల్చింది. అలాగే ఇరాన్‌తో చైనాకు పలు వివాదాలున్నాయ. ఇరాన్‌కు పాకిస్థాన్‌కు సరిపడదు. శత్రువుకు శత్రువు మిత్ర ుడన్న విధంగా చైనా వ్యవహరించింది. పైగా పాకిస్థాన్‌లో చైనా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలు పూర్తిగా ఆ దేశ అధీనంలోకొస్తే ఇటు భారత్.. అటు ఇరాన్ రెండింటి జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితుంటుంది.
శ్రీలంక తరహాలోనే :
శ్రీలంక అంతర్గత విప్లవకారులైన ఎల్‌టిటిఇతో 26ఏళ్ళ సుదీర్ఘ యుద్దం చేసింది. ఇది ఆ దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చింది. అలాగే చైనా వద్ద ఎక్కువ వడ్డీ ధరపై అప్పుడుల చేసింది. హంబంబంతోట నౌకాశ్రయ నిర్మాణానికి భారీగా రుణం సేకరించింది. అయితే ఇందుకోసం శ్రీలంక విమానాశ్రయాలపై తమకు హక్కుభుక్తాలివ్వాలన్న చైనా షరతులకు లోబడ్డమే శ్రీలంక దివాళాకు దారితీసింది. ఈ పరిస్థితిని గమనించాక కూడా చైనా నుంచి రుణాల సేకరణను పాకిస్థాన్ నిలుపుదల చేయలేదు. గతేడాది చివరకి ఆ దేశ విదేశీ రుణం 69ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.
35సార్లు బెయిల్ అవుట్ :
పాకిస్థాన్ ఇప్పుడు ఆర్ధికంగా దివాళా తీసినా గతంలోనూ ఈ స్థాయి ఆర్ధిక దుస్థితిని అనేకసార్లు ఎదుర్కొంది. గత 13ఏళ్ళలో ఇంటర్నేషనల్ మోనిటరింగ్ ఫండ్ (ఐఎమ్ఎఫ్) పాకిస్థాన్‌కు 35సార్లు బెయిలవుట్ ప్రకటించింది. అయినా పాక్ ఆర్ధిక అనారోగ్య పరిస్థితి ఏమాత్రం పెరగలేదు. ఇందుక్కారణం రుణాల్ని సేకరించడంలో పాక్ ఏనాడూ వెనుకంజేయలేదు. 2021తో పోలిస్తే 2022 ఆర్ధిక సంవత్సరంలో పాక్ రుణాల సేకరణ 35శాతం పెరిగింది. పాక్‌లో ఆర్ధిక దుర్వినియోగమే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనానికి దారితీసింది.