12ఏళ్ల బాలుడు కరోనాని జయించి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ బాలుడికి 65రోజుల పాటు వైద్యాన్ని అందించారు వైద్యులు. కిమ్స్ ఆసుపత్రిలో ఆ బాలుడికి చికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే .. యూపీ రాజధాని లక్నోకి చెందిన బాలుడు శ్వాస సమస్యతో బాధ పడుతుండటంతో స్థానిక హాస్పటల్ లో చేర్పించారు తల్లిదండ్రులు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళమని తెలిపారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు సికింద్రాబాద్ కిమ్స్ కు ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు.కరోనా పరీక్షల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించిన వైద్యులు వెనో వీనస్ ఎక్మో పరికరంతో రెండు నెలల పాటు కృత్రిమంగా శ్వాస అందిస్తూ.. క్రమంగా ఆరోగ్య పరిస్థితిని కుదుటపడేలా చేశారు.
వైద్యుల చికిత్సతో ఊపిరితిత్తులు క్రమంగా మెరుగవడంతో.. ఎక్మో సాయాన్ని క్రమంగా నిలిపివేశారు. దేశంలో ఎక్మో చికిత్సపై ఎక్కువ రోజుల పాటు ఉండి, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతడేనని వైద్యులు తెలిపారు.బాలుడు మా వద్దకు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు గట్టిపడిపోయి, శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయలేని కండిషన్ లో ఉన్నాడు. ఎక్మో సాయంతో ఊపిరితిత్తులకు విశ్రాంతి ఇచ్చాం. దీంతో క్రమంగా మేం చేసిన చికిత్సతో ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించాయి. తిరిగి మామూలుగా పనిచేసే స్థితికి వచ్చేశాయని పల్మనాలజీ చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ విజిల్ వెల్లడించారు. పోషకాహారాన్ని పెంచి ఇవ్వడం, ఫిజికల్ రీహాబిలిటేషన్, అడ్వాన్స్ డ్ లంగ్ రికవరీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైద్యుల కృషి ఎనలేనిదని బాలుడి తల్లిదండ్రులు కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..