Wednesday, November 27, 2024

ఉచిత ప‌థ‌కాలు, వాగ్ధానాల‌కు పార్టీల‌కు ఫండ్స్ ఎట్లొస్త‌య్‌.. 19లోగా లెక్క‌లు చెప్పాలన్న ఈసీ

దేశంలో ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు అడ్డు అదుపులేకుండా ఉచిత ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా తాయిలాలు ప్ర‌క‌టిస్తుంటాయి. ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తుంటాయి. ఇట్లాంటి ఉచితాలకు అడ్డుకట్ట వేయాలన్న చర్చ ఎప్పటినుంచో జ‌రుగుతోంది. అయితే.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ కూడా ఉచితాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిపై పరిమితి విధించాలని ఓ నివేదిక వెలువరించింది.

ఇక‌.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కూడా ఇదే అంశంపై స్పందించింది. ఉచితాలకు అయ్యే ఖర్చును, అందుకు అవసరమయ్యే నిధులు ఎక్కడ్నించి తెస్తారన్న విషయాలను రాజకీయ పార్టీలు ప్రజలకు వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఉచితాలను ఆయా పార్టీలు నెరవేర్చగలవా, లేదా? అనే అంశంపై ఓటర్లకు ఓ అభిప్రాయం ఏర్పడుతుందని పేర్కొంది.

అయితే.. ఈ ఉచితాలు, లేదా సంక్షేమ పథకాలకు చట్టబద్ధ నిర్వచనం అంటూ ఏదీ లేదన్నది వాస్తవం అని ఈసీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో ఈ ఉచితాలపై విచారణ జరుగుతున్నప్పటికీ తగిన స్పష్టత లేదని పేర్కొంది. ఈ క్రమంలో, రాజకీయ పార్టీలే తాము ఫలానా పథకం ఏ కారణంతో ఇస్తున్నారో, వాటికి నిధులు ఎక్కడ్నించి తీసుకువస్తారో కూడా చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది.

కాగా, ఇట్లాంటి హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని, అందుకే ఆయా ఉచితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం తమ హక్కుగా ఓటర్లు భావించాలని ఎన్నిక‌ల సంఘం సూచించింది. దీనిపై ఈ నెల 19వ తేదీలోగా అన్ని పార్టీలు నివేదిక ఇవ్వాల‌ని ఈసీ లేఖ‌లు రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement