ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ రెడీ అవుతోంది. యూపీతో పాటు దేశంలోని మరో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈసీ ఎన్నికలకు అన్ని సన్నాహాలు ప్రారంభించింది. జనవరి మొదటి వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలను జనవరి 5 తర్వాత ఎప్పుడైనా ప్రకటించవచ్చని తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని, లేకుంటే వచ్చే వారం ఈసీ బృందం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఎన్నికల ప్రకటన వెలువడే చాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు?
యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగునున్నట్టు సమాచారం. ఈసీ కూడా దీని ఆధారంగా ఎన్నికలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే పెద్ద స్టేట్ కావడంతో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ (ఎలక్షన్ కమిషన్) భావిస్తోంది. అదే సమయంలో, 2017లోనూ రాష్ట్రంలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడగా మిత్రపక్షాలతో కలిపి 325 సీట్లు సాధించి అధికారం దక్కించుకుంది.