Tuesday, November 26, 2024

Big Story | పోలింగ్‌ శాతం తగ్గుదలపై ఈసీ ఫోకస్‌.. ఓటర్లను పోలింగ్​ బూత్​కు రప్పించేలా యత్నాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎందుకీ నిరాశక్తత ? ఓటు హక్కు నమోదుకు పోటీ పడుతున్న ప్రజలు, ఔత్సాహికులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేసేందుకు ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ? ఎపిక్‌ కార్డులను కొన్ని అవసరాలకు గుర్తింపు కార్డులుగానే భావించి వాడుతున్నారా…? ఓటును ఎందుకు భవితవ్యం మార్చే హక్కుగా భావించడంలేదు…? అనే అంశాలపై ఈసీ దృష్టిసారించింది. తగ్గుతున్న పోలింగ్‌ శాతం పెంపు, రానున్న ఎన్నికల్లో ఓటర్లలో అవగాహనే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. అసలీ నగరానికి ఏమైంది? ఎక్కువ శాతం చదువుకున్నవారే. అంతా హై ప్రొఫెషనల్సే.. అయినా మారుమూల పల్లెజనాల కన్నా అధ్వాన్నంగా మారిపోయారు. భవిష్యత్తును నిర్దారించే ఓటు-హక్కును వినియోగించడంలో ప్రతీసారీ నిరాసక్తతననే ప్రదర్శిస్తున్నారు.

2018లో ఇంత పెద్ద భాగ్యనగరంలో కేవలం 50 శాతం పోలింగ్‌ నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కలిసి జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో నమోదైన 68.5శాతం కంటే స్వల్పంగా ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 76.5 పోలింగ్‌ శాతం నమోదైంది, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కేవలం 50శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే వరంగల్‌ (తూర్పు) జిల్లాలోని నర్సంపేటలో అత్యధికంగా 84శాతం, హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో అత్యల్పంగా 45శాతం పోలింగ్‌ నమోదైంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో ఉన్న దృష్ట్యా సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది.

సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, పినపాక, యెల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మంథని. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 65శాతం పోలింగ్‌ నమోదైనట్లు- ఈసీఐ గణాంకాలు చెబుతున్నాయి హైటెక్‌ సిటీగా పేరొందిన హైదరాబాద్‌లో అక్షరాస్యత శాతం తక్కువేమీ కాదు. దాదాపు అంతా చదువుకున్నవారే. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారే. అలాంటి సిటీ-లో మధ్యాహ్నం మూడింటికి కూడా పోలింగ్‌ శాతం 35ను మించకపోవడం విస్మయానికి గురిచేసింది. ఆఖరు రెండుగంటల్లో 15 శాతం పెరిగి.. 50 శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

- Advertisement -

పాతబస్తీలో పోలింగ్‌ పరిస్థితి మరీ దారుణం. ఓట్లు- వేసేందుకు జనాలకు అస్సలు ఆసక్తి కనబర్చలేదు. ఎక్కడ చూసినా పోలింగ్‌ సెంటర్లన్నీ .. ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఆ ప్రభావం జంటనగరాల సరాసరి పోలింగ్‌ శాతం మీద చూపింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో 50శాతం పోలింగ్‌ నమోదైంది.

ఖైరతాబాద్‌ – 54శాతం, జూబ్లీహిల్స్‌ – 54.60శాతం, సనత్‌నగర్‌ – 52.63శాతం, నాంపల్లి – 44.02 శాతం, కార్వాన్‌ – 50.89శాతం, గోషామహల్‌ – 50.28 శాతం, చార్మినార్‌ – 46.03శాతం, చాంద్రాయణగుట్ట – 48.00శాతం, యాకుత్‌పురా – 45.00శాతం, బహదుర్‌పురా – 49.50 శాతం, సికింద్రాబాద్‌ – 57.00 శాతం, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – 48.90
మలక్‌పేట – 55.54, అంబర్‌పేట – 55.20 శాతంగానే నమోదైంది.

ఓటు-హక్కు వినియోగంపై జరిగిన అవగాహన కార్యక్రమాలూ తక్కువేం కాదు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో.. ఓటరు చైతన్యకార్యక్రమాలు అనేకం చేపట్టింది ఈసీ. అయినప్పటికీ, పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. సిటీ-జనాలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఓటేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. ఓటు- హక్కు వినియోగించుకునేందుకు ఇచ్చిన హాలీడేని కూడా.. శని,ఆదివారాల మాదిరి వారాంతపు హాలీడేలుగా, జాలీడేలుగా మార్చేసుకున్నారని స్పష్టమవుతోంది. సినీ హీరోలు, ఇతర రంగాల ప్రముఖులు సైతం కుటు-ంబసమేతంగా వచ్చి ఓటు- వేస్తే.. నగరంలోని సామాన్య, మధ్యతరగతి జనాలు మాత్రం పోలింగ్‌ కేంద్రాల వైపు చూడకపోవడం గమనార్హం.

ఈ పరిస్థితులను మార్చేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. అనేక చర్యలను తీసుకుంటోంది. పెద్ద ఎత్తున సాంకేతికతలను వాడుతోంది. అనేక యాప్‌లను డిజైన్‌ చేసింది. క్షణాల్లో ఫోన్‌లోనే పోలింగ్‌ కేంద్రం కనిపించేలా, దారి చూపేలా యాప్‌ను డిజైన్‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement