Saturday, November 23, 2024

రాజాసింగ్‌పై ఈసీ ఆగ్రహం.. కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్‌ఈసీకి ఆదేశం

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, ర్యాలీలు, మీడియా ఇంటర్వ్యూలపై 72 గంటలపాటు నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా రాజాసింగ్‌ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో గత బుధవారం వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది.

అయితే, ఇంతకు ముందు జారీ చేసిన నోటీసులపై ఆయన తరఫు న్యాయవాది కే ఆంథోనీరెడ్డి ఈసీని సంప్రదించి.. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు కావాల‌ని కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోసారి గడువు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఆయన న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఈసీ తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో రికార్డింగ్‌ను పరిశీలించామని, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా, భయపెట్టేలా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement