Tuesday, November 19, 2024

ముక్కు నేలకు రాస్తారా?: అధికారులకు ఈటల జమున సవాల్

జమున హ్యాచరీస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున మండిపడ్డారు.  కష్టపడి పైకి వచ్చామని.. ఎవర్నీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవని.. ఆ ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తామెలాంటి తప్పు చేయలేదని, 46 ఎకరాల కంటే ఎక్కువని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్ విసిరారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా? అని మండిపడ్డారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని పేర్కొన్నారు.

దేవర యాంజల్ భూములు 1994 లో కొనుగోలు చేశామన్నారు. తమ గోదాములు ఖాళీ చేయించాలని, ఆర్థిక వనరులు దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది చాలా బాధాకరమన్నారు. ఎకరం కొన్నా.. ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చెప్పే కొనుగోలు చేశామని.. ఈటల జమున స్పష్టం చేశారు. సర్వే చేయొద్దని అధికారులకు తాము చెప్పలేదన్న ఆమె.. తమ సమక్షంలో సర్వే చేయాలని మాత్రమే చెప్పామన్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవని ఈటల భార్య జమున పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement