హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తొలిసారి హుజూరాబాద్‌కు వెళ్లారు. దీంతో హూజురాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒకే పర్యటన చేయడం రాజకీయంగా వేడి పెంచింది. హుజురాబాద్‌లోని కాట్రపల్లి వద్ద ఈటల-పల్లా రాజేశ్వర్ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు హుజురాబాద్ లోని కాట్రపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు. అదే సమయంలో హుజూరాబాద్‌లోని జమ్మికుంటకు పల్లా కన్వాయ్ వెళుతుంది. పల్లాను చూసిన ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు ‘జై ఈటల.. జైజై ఈటల.. జై బీజేపీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పల్లా కాన్వాయ్ రెండు నిముషాలపాటు ఆగిపోయింది. అయితే, పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు కూడా ‘జై టీఆర్ఎస్.. జై పల్లా రాజేశ్వర్ రెడ్డి’ అంటూ పోటా పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరుపార్టీల నినాదాలతో కాట్రపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే, పోలీసులు రంగంలోకి దిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరువర్గీయులను పంపించారు. ఈటల నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.