హుజురాబాద్ ఉపఎన్నికలో తన గెలుపు.. కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభివర్ణించారు. ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం అని ఈటల అన్నారు. నిర్బంధాలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. కుట్రదారుడు కుట్రలకు నాశనమైపోతాడని పేర్కొన్నారు. కుల సంఘాలు, భవనాలు, గుడులకు డబ్బులు ఇచ్చారని చెప్పారు. దళిత బంధు పెట్టినా ప్రజలను తనను గెలిపించారని అని అన్నారు. ఓటు వేయకపోతే దళిత బంధు నిలిపేస్తామని ప్రభుత్వం బెదిరించిందన్న ఈటల.. పింఛన్లు ఆపేస్తామని వృద్ధులనూ భయపెట్టిందని మండిపడ్డారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసమే గత ఆరు నెలలుగా అధికార యంత్రాంగం పనిచేసిందన్నారు. ఈటల రాజేందర్ పార్టీలు మారే వ్యక్తి కాదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి తనను వెళ్లగొట్టారని తెలిపారు. తనను బీజేపీ దగ్గరకు తీసుకుని చేర్చుకుందన్నారు. తాను వెన్నుపోటు పొడిచానని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. వారు వెళ్లగొడితేనే తాను బయటకు వచ్చానని తెలిపారు. వెన్నుపోటు పొడిచింది కేసీఆరే అని ఈటల వ్యాఖ్యానించారు. తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే, వేసిన వారి మీదే అది పడుతుందన్నారు. తమపై కుట్రలు పన్నితే, కుట్రలు పన్నే వారే నష్టపోతారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు నిబద్ధతకు మారుపేరు అని ఈటల పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: Big Story: లక్ష ఓట్లతో.. లక్ష్యాన్ని ముద్దాడిన ఈటల