Saturday, November 23, 2024

ముహూర్తం ఖరారు.. జూన్ 8నే చేరిక?!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 8వ తేదీన ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నట్లు  ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ సంబంధించి శుక్రవారం ఆటల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న ఈటల బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ ఉమ కూడా కాషాయ కండువ కప్పుకోనున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సమైన జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ భావించారు. అయితే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపేందుకు కొంత సమయం పట్టడంతో ఈ నెల 4న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన రాజీనామా అనంతరం జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల రాజేందర్.. ఆయనతో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీలో చేరితే తనకు లభించే ప్రాధాన్యత ఏంటనే అంశంపై ఆయన చర్చించారు. అయితే, ఈటల ఎలాంటి కండీషన్లు లేకుండానే బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

మరోవైపు రాజీనామా కంటే ముందే ఈటలను సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈటల వ్యవహారంపై అతితూచి అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలపై ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించిన కేసీఆర్… ఇక పార్టీ పరంగా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement