హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భావోద్వేగానికి గురైయ్యారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని తెలిపారు. ‘’సాదుకున్నా మీరే,చంపుకున్నా మీరే. ధర్మం గెలుస్తుంది. ప్రగతి భవన్ అహంకారాన్ని బొందపెడదాం..హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం ’’ అని ఈటల వ్యాఖ్యానించారు.
ఉపఎన్నిక కోసం కొన్ని వందల కోట్లను అధికార టీఆర్ఎస్ ఖర్చుచేసిందని ఈటల మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వ జీవోల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టారని నిప్పులు చెరిగారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి డబ్బును, మద్యాన్ని పంచిపెడుతున్నారని ఈటల ఆరోపించారు. ప్రజల ప్రేమ, అభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవని చెప్పారు.
ఇది కూడా చదవండి: మడ అడవులు కబ్జా.. అధికారులను కదిలించిన ఆంధ్రప్రభ