హైదరాబాద్, ఆంధ్రప్రభ: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) విస్తరణ తొలి దశ ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. విమానాశ్రయంలో రద్దీని తట్టుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టారు. విమానాశ్రయం విస్తరణంలో భాగంగా కొత్తగా ఈస్ట్రర్న్ టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. విమానాశ్రయం ఆవరణలో మూడు ఏరో బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా ఈ విమానాశ్రయాన్ని 34 మిలియన్ల మందికి మించి ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేలా విస్తరించిన సంగతి తెలిసిందే. కొత్త రూట్ డెవలప్‌మెంట్‌తో మెరుగైన కనెక్టివిటీ, ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల, కొత్త రన్‌వే స్లాట్‌ల కోసం డిమాండ్ కూడా విమానాశ్రయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిందని జీఎంఆర్ సంస్థ తెలిపింది.
విస్తరించిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్‌సైడ్, ల్యాండ్‌సైడ్ ప్రాంతంలో అదనపు మౌలిక సదుపాయాలతో ఇప్పటికే ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌తో (కాన్‌కోర్స్, పయర్స్ వద్ద) ఇంటిగ్రేట్ చేయబడుతుంది. పునరుద్ధరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ విస్తీర్ణం 379,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెకింగ్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. విస్తరించిన దేశీయ, అంతర్జాతీయ పయర్ భవనాలలో మరిన్ని లాంజ్‌లు, రిటైల్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఔట్‌లెట్లు ఉంటాయి.
ట్యాక్సీల రాకపోకలకు సొరంగ మార్గం
విమానాశ్రయ విస్తరణలో భాగంగా ట్యాక్సీలు (రవాణా వాహనాలు) రాకపోకలకు ప్రత్యేకంగా సొరంగ మార్గం నిర్మించారు. నాలుగు ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీ వేలు ఏర్పాటు చేశామని, వీటికోసం ప్రత్యేక మార్గం నిర్మించడం దేశంలోనే తొలిసారని జీఎంఆర్ సంస్థ వెల్లడించింది.