ఆంధ్రప్రదేశ్-తెలంగాణా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణాలో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. బోర్డర్ వద్ద పోలీసులు మరోసారి ఆంక్షలను కఠినతరం చేశారు. ఎపి నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు ఈ-పాస్‌లు తప్పనిసరి చేశారు. లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఈ-పాస్ ఉంటేనే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి అనుమతిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర, సరుకు, అంబులెన్స్ కు మాత్రమే పాస్‌లు లేకున్నా అనుమతిస్తున్నారు.
కాగా, గతంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు తెలంగాణాలోకి ప్రవేశం ఉండేది. కానీ గత నాలుగు రోజుల నుండి ఈ.పాస్ తప్పనిసరి చేయటంతో ప్రయాణికులు, వాహనదారులు అయోమయంలో పడ్డారు. గతంలో మాదిరిగానే అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వాహనదారులు కోరుతున్నారు.