Monday, November 25, 2024

Duplicates మార్కెట్​లో ‘ఎలక్ట్రిక్’​ మాయ‌! నాసిరకం ఈ బైక్​ల విక్రయాలు

అసెంబుల్డ్​ విడిభాగాలతో తయారీ
ఏది ఒరిజినలో పోల్చుకోలేకపోతున్న వినియోగదారులు
నాణ్య‌తపై అనేక అనుమానాలు
అగ్నికి ఆహుతవుతున్న బైక్​లు
అధికారులు నాణ్యతను పరీక్షించాలంటున్న జనం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : పెరుగుతున్నపెట్రోల్ ధ‌ర‌లు… ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం రాయితీలు.. అలాగే ర‌వాణా శాఖ నుంచి లైసెన్స్ అవ‌స‌రం లేదు… ఇలాంటి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉండ‌డంతో ఎల‌క్ట్రిక్​ వెహిక‌ల్స్ కొనుగోలుకు వినియోగ‌దారులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు విడిభాగాలతో వాహ‌నాలు త‌యారు చేసి అంట‌గ‌డుతున్నార‌నే ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డీల‌ర్ల కంటే త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వ‌డంతో కొనుగోలుకు వినియోగ‌దారులు వీటిని కొనడానికి ఎగబడుతున్నారు. తయారీ ప్రామాణికత అంశాలపై నిపుణుల విశ్లేషణలు.. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేద‌ని తెలుస్తోంది. అసెంబుల్డ్​ పార్ట్స్​తో ఎలక్ట్రిక్​ వాహనాలను తయారు చేసి తమకు నచ్చిన లోగో పేర్లతో విక్ర‌యిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని ప్ర‌మాదాలు వాటి నాణ్య‌త‌పై అనుమానాలు రేక‌త్తిస్తున్నాయి.

- Advertisement -

ఎల‌క్ట్రిక‌ల్ వెహిక‌ల్స్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సాహం


ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. మూడేళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా అయిన నారాయణపేట, జోగులా గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ న‌గర్ లో 106 ఎలక్ట్రిక‌ల్‌ వాహనాల షోరూములు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు తదితర అంశాలను ఆసరాగా చేసుకుని మార్కెట్​లోకి కుప్పలు తెప్పలుగా వివిధ పేర్లతో రకరకాల వాహనాల విక్ర‌యం జోరుగా సాగుతోంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి విడి భాగాలు తెచ్చుకుని ఇక్క‌డ వాహ‌నాలు త‌యారు చేసి కొంద‌రు విక్ర‌యిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ వాహ‌నాలు ఏది ఒరిజిన‌ల్​? ఏది అసెంబుల్డ్​? అనేది కూడా వినియోగ‌దారుడు పోల్చ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాయ‌ని ప‌లువురు చెబుతున్నారు.

నిర్మాణం ఒకలా ఉంటుంది… నాణ్య‌తే డౌట్‌!
కంపెనీ వెహిక‌ల్స్ మాదిరిగా అసెంబుల్డ్​ వెహిక‌ల్స్ కూడా ఉంటున్నాయి. అయితే నాణ్య‌తే అనుమానంగా ఉంటుంది. ఎల‌క్రిక‌ల్ వెహిక‌ల్స్‌కు అత్యంత కీలకమైన అంశం సంబంధిత వాహనానికి మోటర్, బ్యాటరీ, కనెక్టర్ కనెక్టివిటీ కీలకం. వాహ‌నాలను కంపెనీల మాదిరిగా నిర్మాణం చేస్తారు. కానీ నాణ్య‌త మీదే డౌట్ ఉంటుంది. అయితే సాంకేతిక ప‌రిజ్ఞానం తెలిసిన వారు మాత్ర‌మే పోల్చ‌గ‌ల‌రు. వాహనం పరికరాల బిగింపు సమయంలో మేల్, ఫిమేల్ ప్లగిన్ సెంట్రల్ వైరింగ్ త‌దిత‌ర అంశాల‌తో వాహ‌నం న‌డ‌వ‌డం ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే లోప‌ల నిర్మాణాల్లో ఏమైనా తేడాలు వ‌స్తే నాణ్య‌త కొర‌వ‌డుతుంది. ప్ర‌మాదాల‌కు కూడా గుర‌వుతాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ గుండెకాయ లాంటిది. దీని నిర్మాణం, సామర్థ్యంపై వాహనం ప్రామాణికత ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

బ్యాటరీల్లో రెండు రకాలు
బ్యాటరీల్లో రెండు రకాలు ఉంటాయి. లెడ్ ఆసిడ్ బ్యాటరీ, డ్రై సెల్స్ బ్యాటరీ. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాహనం యొక్క ఆ రక్షణ కవచంగా డ్రై సెల్ఫ్ బ్యాటరీలను ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ద్రవ రూప లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాలకు వాడితే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే మోటర్ వాహనం నీటిలో ప్రయాణించినా ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. నాన్ బ్రేకబుల్ అయ్యుంటే వాహనం ప్రామాణికతకు ప్రధాన రక్షణ గా నిలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పాటించాల్సిన ప్రామాణికత అంశాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఉమ్మడి జిల్లాలో ఇష్టానుసారంగా త‌యారు చేసి వాహనాలు విక్ర‌యిస్తున్నారు. ఏ ప్రామాణికాలు తీసుకోకుండా వాహ‌నాలు త‌యారు చేసి విక్ర‌యిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌మాదాలు కూడా లేక‌పోలేదు
స‌రైనా ప్రామాణిక‌త లేక‌పోతే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ల్ జిల్లాలో చాలాచోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ సమయంలో ప్ర‌మాదాలు జ‌రిగాయి. అలాగే రోడ్డుపై ప్రయాణించే సందర్భాల్లో అగ్నికి ఆహుతి అయిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధార‌ణంగా వాహ‌న నిర్మాణం స‌క్ర‌మంగా ఉంటే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉండ‌ద‌ని, ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఈ వాహ‌నాల నాణ్య‌త ప‌రిశీలించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement