Friday, November 22, 2024

డీఎస్సీ ఎన్ని’క‌ల’ ముందేనా….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్‌ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడటానికి మరింత సమయం పట్టే సూచ నలు కనిపిస్తున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు వేసి దాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకోవాలనే యోచనలో సర్కారు పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చివరి నోటిఫికేషన్‌గా డీఎస్సీని ప్రకటించి తమ ప్రభుత్వం గ్రూప్స్‌, పోలీస్‌, డీఎస్సీ తదితర అన్నిరకాల నోటిఫికేషన్‌ను వేసిందనే పాజిటివ్‌ సెన్స్‌ను రాబట్టే ప్రయత్నం చేసే వీలుందని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 26 వరకు నోటిఫికేషన్లు రాష్ట్రంలో వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రకటించిన సుమారు 13 వేలకు పైగా పోస్టులకు ఇంకా ఆర్థిక శాఖ అనుమతివ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీఎస్సీ నోటిఫికషన్‌కు ఎన్నో అవరోధాలు వెంటాడుతున్నాయి. ఇంత వరకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వకపోవడం, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్‌ పడడం, హేతుబద్ధీకరణ జరగాల్సి ఉండడం, టీచర్‌ పోస్టుల భర్తీ బాధ్యతను డీఎస్సీకా? లేక టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించాలా? అనేది ఇంకా తేలక పోవడం లాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే డీఎస్సీకు ఆలస్యం జరుగుతున్నట్లు విద్యావేత్తలు విశ్లేషిసు ్తన్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియకు మార్చి 14 వరకు హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అంత వరకూ బదిలీల ప్రక్రియ జరగడానికి అవకాశంలేదు. ఇది పూర్తయితే గానీ డీఎస్సీకి లైన్‌ క్లియర్‌ అయ్యే అవకాశం తక్కువే. మరోవైపు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి.


ఈ సమయంలో బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశం కూడా తక్కువే. అనంతరం ఏప్రిల్‌ 23 నుంచి వేసవి సెలవులు అమ ల్లోకి రానున్నాయి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పటికీ కోర్టులో కేసు తేలకపోతే బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం జరగనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ఖాళీలను బట్టి డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కనబడుతోంది.
గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 గ్రూప్‌-4, పోలీస్‌ తదితర ఉద్యోగాలు ఒక ఎత్తయితే.. టీచర్‌ పోస్టుల భర్తీ మరో ఎత్తు. టీచర్‌ ఉద్యోగాలకు ఉద్యోగార్థుల్లో ఉండే క్రేజ్‌ మిగతా పోస్టు లకు పెద్దగా ఉండదు. టీచర్‌ కొలువనేది చాలా మంది అభ్యర్థు లకు అది కలల కొలువు. టీచర్‌ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగార్థులు ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. చివరగా 2017లో టీఆర్టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ వెలువడింది. అప్పటి నుంచి మళ్లిd ఇంత వరకూ డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనేలేదు. టీచర్‌ నోటిఫికేషన్‌ కోసమే దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు అభ్యర్థులు రాష్ట్రంలో ఎదురుచూస్తున్నారు. వివిధ రకాల ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేస్తున్నా గానీ.. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడంలో మాత్రం తీవ్ర తాత్సారం చేస్తోంది. ఇంతవరకు టీచర్‌ ఖాళీల భర్తీకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
రాష్ట్రంలో టెట్‌ నిర్వహించి కూడా దాదాపు 8 నెలలు కావొస్తున్నా ఇంత వరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ఒకవైపు ఆర్థికశాఖ, మరోవైపు విద్యాశాఖ దోబూచులాడుతున్నాయి. టెట్‌ను మరోసారి నిర్వహించాలని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్సీకు, ఉపాద్యాయ బదిలీలు పదోన్నతులకు లింకు పెడుతున్నారనే వాదనలు కూడా విద్యావర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వకుండా ఖాళీలు తెలిసే ప్రసక్తి లేకపోవడంతో ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీల ప్రక్రియ వేసవి సెలవుల తర్వాత మొదలైనా అది పూర్తవడానికి రెండు మూడు నెలలు పట్టే వీలుంది. డిసెంబర్‌లో అసెంబ్లిd గడువు ముగి యడానికి రెండు మూడు నెలల ముందు నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. బదిలీల ప్రక్రియలో ఎవరైనా ఉపాధ్యా యులు తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళితే మళ్లిd ఆలస్యం కానుంది. ఉపాధ్యాయ బదిలీలకు, ప్రదోన్నతులకు సంబంధం లేకుండా నోటిఫికేషన్‌ను జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.
8న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి: రావుల రామ్మోహన్‌ రెడ్డి, టీచర్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చి వెంటనే టీఆర్టీ లేదా డీఎస్సీ నోటి ఫికేషన్‌ వేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న విద్యా శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్‌ వేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు. డీఎస్సీకు టీచర్ల బదిలీలకు లింకు పెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement