డ్రగ్స్ తీసుకువెళ్తున్న ముగ్గురిని పోలీసులు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.కాగా వారిలో ఓ మహిళా టెక్కీ ఉండటం విశేషం. గోవా నుండి డ్రగ్స్ తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. నూతన సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ ని తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ కారులో ఇద్దరు యువకులు, ఓ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం అందడంతో తమ పోలీస్ బృందం దాడులు నిర్వహించామన్నారు.
మెహిదీపట్టణం విజయనగర్‌కాలనీకి చెందిన మహ్మద్ జమీర్ సిద్దిఖ్, హఫీజ్‌పేట గోపాల్ నగర్ లోని నివాసం ఉంటున్న మహిళా టెక్కీ పులి రమ్య , అల్మాస్ గూడ శేషాద్రినగర్ లో నివాసం ఉంటున్న కౌకుంట్ల అనీల్ ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుండి 9.4 గ్రాముల డ్రగ్స్ తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.నిందితులు ఉపయోగించిన కారుని కూడా సీజ్ చేశామని వెల్లడించారు.ఈ ముగ్గురు క్లబ్ హౌస్ అనే ఆన్ లైన్ యాప్ ద్వారా పరిచయమయ్యారన్నారు. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఓ క్లబ్‌లో ఈ ముగ్గురు తరచు కలుసుకొనే వారని పోలీసులు చెప్పారు. కౌకుంట్ల అఖిల్ గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చేవాడని తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. ఈ డ్రగ్స్ ను రమ్య, సిద్దిఖ్‌కు ఇచ్చేవారని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..