భారత్, పాకిస్తాన్ బోర్డర్లో భద్రతా దళాలకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పాక్ నుంచి అక్రమ చొరబాట్లతోపాటు ఇప్పుడు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సప్లయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని అరికట్టేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ మధ్య డ్రోన్లపై ప్రత్యేక దృష్టిపెట్టింది.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
పాకిస్తాన్ సరిహద్దు నుండి డ్రగ్స్, మందుగుండు సామగ్రిని సప్లయ్ చేయడానికి డ్రోన్స్ ఉపయోగిస్తున్నట్టు భారత సెక్యూరిటీ దళాలు కనిపెట్టాయి. కొంతకాలంగా డ్రోన్ ముప్పును ఎదుర్కొనే పనిలో బీఎస్ఎఫ్ ఉందని, సరిహద్దుల వద్ద తగినంత ఎత్తులో డ్రోన్స్ ద్వారా ఇట్లాంటి చేరవేత కార్యక్రమాలు పెరిగాయని ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే.. డ్రోన్ ఫోరెన్సిక్స్ కోసం ఢిల్లీలోని క్యాంపులో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చివేసి, అక్కడి నుంచి సప్లయ్ అవుతున్న వస్తు, సామగ్రిపై అధ్యయనాలు చేస్తున్నట్ట తెలుస్తోంది. ఇక.. భద్రతా దళాలు ఆకాశమార్గం ద్వారా, సరిహద్దు ఆవల నుంచి అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న నేరస్థుల చిరునామాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ మీదుగా భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు 3,000 కిలోమీటర్లకు పైగానే ఉంది. ఈ బోర్డర్లో BSF దళాలు నిత్యం గస్తీ కాస్తుంటాయి. అంతేకాకుండా బోర్డర్ నుంచి అక్రమ రవాణాని అరికట్టే దిశగా పలు కార్యక్రమాలు భద్రతా బలగాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో డ్రోన్ రిపేర్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తరువాత అక్టోబర్‌లో ఫోరెన్సిక్స్ విశ్లేషించడానికి ఆ ల్యాబ్‌ని మరింత మెరుగుపరిచారు. ఇక.. భారత్ పాక్ బోర్డర్ నుంచి వచ్చే పలు డ్రోన్లను కూల్చేస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని ఏట్లాంటి వస్తు, పదార్థాలు రవాణా చేస్తున్నారనే అంశాలను అనలైజ్ చేస్తున్నట్టు పంజాబ్ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపాయి.
ఈ సమస్య చాలా తీవ్రమైనదని.. డ్రోన్ బృందాలను మోహరించినా, డెప్త్ పెట్రోలింగ్ చేపట్టినా సమస్య ఆగడం లేదని చెప్పారు డీజీ పంకజ్ కుమార్ సింగ్. ఆకాశమార్గం ద్వారా డ్రోన్ల ద్వారా సప్లయ్ చేసే డ్రగ్స్, ఇతర పదార్థాలను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ పరికరాలు అమరుస్తున్నామన్నారు. అయినా నేరస్థులు చాలా తెలివిగా ఇతర ప్రాంతాల నుంచి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు డీజీ చెప్పారు.