డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన కరోనా డ్రగ్ 2-డీయోక్సీ-డీ-గ్లూకోస్ (2డీజీ) అన్ని రకాల కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తాజగా కొత్త అధ్యయనంలో తేలింది. డ్రగ్ సార్స్-కోవ్-2 వైరస్ మల్టిఫికేషన్‌ను తగ్గిస్తుందని కొత్త అధ్యయనం పేర్కొంది. కణాల్లో వైరస్ విస్తృతిని తగ్గించడమే కాకుండా దాని తీవ్రతను తగ్గించడం ద్వారా కణాలు మృతి చెందకుండా చేయగలదని అధ్యయనంలో వెల్లడైంది. 2డీజీ డ్రగ్ కణాల్లో సంక్రామ్యత ప్రేరిత సైటోపతిక్ ప్రభావాన్ని (సీపీఈ) తగ్గించడంతో పాటు తొలగింపును నిరోధిస్తుందని గుర్తించారు. జూన్ 15 న ప్రచురించబడిన ఆయన అధ్యయనం ఇంకా పరిశీలించబడలేదు. దీనిని అనంత్ నారాయణ్ భట్, అభిషేక్ కుమార్, యోగేశ్ రాయ్, దివియా వేదగిరి తదితరులు ఈ అధ్యయన నివేదికను తయారు చేశారు
కాగా, కరోనా బారినపడి మృత్యువుతో పోరాడేవారికి ఈ ఔషధం బాగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవిడ్ ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా 2డీజీ డ్రగ్ కాపాడుతుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. మే 19న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ డ్రగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. 2డీజీ డ్రగ్ వాడిన తర్వాత వైరస్ వృద్ధి చెందడం తగ్గుతున్నట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు. సాచెట్ ప్యాకెట్ రూపంలో ఇది మార్కెట్‌లోకి రానుంది. దీని ధరను ఒక్కో సాచెట్ రూ.990గా నిర్ణయించారు. దీన్ని మంచినీళ్లలో కలుపుకుని తాగిన వెంటనే అది పనిచేయడం మొదలుపెడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో దీన్ని వాడిన రోగులు త్వరగా కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు.
క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన వివరాల ప్రకారం… కోవిడ్‌తో ఆస్పత్రిపాలైన పేషెంట్లకు 2డీజీ డ్రగ్ ఇవ్వడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారు. సాధారణంగా కోవిడ్ పేషెంట్ వ్యాధి నుంచి కోలుకోవడానికి పట్టే సమయం కంటే… ఈ డ్రగ్ తీసుకోవడం ద్వారా రెండున్నర రోజుల ముందే కోలుకుంటారు. అలాగే పేషెంట్‌కు బయటినుంచి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 40 శాతం తగ్గుతుంది.ఈ డ్రగ్ వైరస్ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్ అందకుండా చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలింది.
ఇదీ చదవండి: అవినీతి బాగోతం: పంచాయతీ కార్యదర్శీ.. ఇదేం కక్కుర్తి!