Saturday, November 23, 2024

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, తొలిసారి ఆదివాసి మ‌హిళ‌కు చాన్స్ ఇచ్చిన‌ బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అనేక ఊహాగానాలకు తెరదించుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముర్ము పేరును ఖరారు చేయడానికంటే ముందు బీజేపీ అగ్రనాయకత్వం అటు మిత్రపక్షాలు, ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చర్చించారు. 20 మంది పేర్లు పరిశీలించిన తర్వాత ముర్మును ఖరారు చేసినట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా వెల్లడించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఇప్పటి వరకు గిరిజన-ఆదివాసీ వర్గాలకు రాష్ట్రపతి పదవిలో కూర్చునే అవకాశం లభించలేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముర్మును ఎంపిక చేసినట్లు నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా ఆమె నిలిచారు. నిజానికి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించింది. అయితే అప్పుడు దళిత సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో ఆమె అవకాశాన్ని కోల్పోయారు. కానీ బీజేపీ నాయకత్వం ఈసారి గిరిజన – ఆదివాసీ సామాజిక సమీకరణాలకు, మహిళా సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ముర్మును ఖరారు చేసింది. జూన్ 25న ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామపత్రాలను సమర్పించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

‘అత్యుత్తమ రాష్ట్రపతిగా నిలుస్తారు’
ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ముర్ము తన జీవితాన్ని సమాజానికి సేవ చేసేందుకే అంకితం చేశారని ప్రధానమంత్రి మోదీ అన్నారు. పేద, అణగారిన ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేశారని కొనియాడారు. ఆమెకు విశేషమైన పాలనాపరమైన అనుభవం ఉందన్నారు. ముర్ము దేశానికి అత్యుత్తమ రాష్ట్రపతిగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు, పార్లమెంటరీ బోర్డు సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిపై తుది విడత చర్చలు జరిపింది. పార్లమెంటరీ బోర్డు భేటీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement