Saturday, November 23, 2024

బీజేపీలోకి డా. శ్రావణి.. కండువా కప్పిన డీకే అరుణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మునుగోడు ఉపఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరికల విషయంలో ఏర్పడ్డ స్తబ్ధతకు బ్రేక్ పడింది. జగిత్యాల మున్సిపాలిటీ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో ఆయన చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆమెకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపుల కారణంగా ఈ ఏడాది జనవరి 25న జగిత్యాల మున్సిప్ ఛైర్‌పర్సన్ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన డా. శ్రావణిని బీజేపీ నేతలు అరవింద్, ఈటల రాజేందర్ మాట్లాడి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. యువ నేతలకు ఆ పార్టీలో ప్రాధాన్యత లేదని, ఇందుకు డా. శ్రావణి ఉదంతమే ఒక ఉదాహరణ అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బీజేపీ పోరాడుతోందని, ఈ పోరాటంలో భాగం పంచుకోడానికి వచ్చిన శ్రావణిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అధికారం చేపట్టబోయేది బీజేపీయేనని అన్నారు.

ఆత్మాభిమానం చంపుకోలేక బ‌య‌టికొచ్చా..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనను అణిచివేస్తూ వేధింపులకు గురిచేశారని డా. శ్రావణి అన్నారు. కన్నీరు పెట్టుకుని బయటకొచ్చిన తనను బీఆర్ఎస్ అధిష్టానం కనీసం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే తాను పార్టీ వీడి బయటికొచ్చానని చెప్పారు. 1975 నుంచి తన తండ్రి సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారని, తమ కుటుంబం మొదటి నుంచి బీజేపీతో అనుబంధం కలిగి ఉందని అన్నారు. అయితే రాజకీయంగా తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచానని, కానీ అక్కడ మహిళలకు, యువ నాయకత్వానికి ప్రాధాన్యత లేకపోగా వేధింపులు, అణచివేత ఉన్నాయని వాపోయారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తనను ఓదార్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. అంతర్జాతీయ చిత్రపటంపై భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతూ, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర నాయకత్వంలో పనిచేయాలని, భరతమాతకు సేవ చేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకే ఎలాంటి పదవులు ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తలా, భరతమాత సైనికురాలిలా పార్టీలో చేరుతున్నానని డా. శ్రావణి చెప్పారు.

- Advertisement -

అభివృద్ధి శూన్యం.. అవినీతి ఘనం

తెలంగాణలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. శ్రావణిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రంగా వేధించారని, మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆత్మాభిమానం చంపుకోలేక తన పదవికి రాజీనామా చేసి వచ్చారని ఆయనన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జగిత్యాలలో ఈ విషయం తెలుసుకుని వెంటనే శ్రావణిని సంప్రదించానని, బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించానని చెప్పారు.

చాలా మంది టచ్‌లో ఉన్నారు

భారత రాష్ట్ర సమితి పార్టీలో కిందిస్థాయి నేతలకు ఏమాత్రం గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆ పార్టీలో కిందిస్థాయి నేతలు ప్రతిరోజూ వేధింపులకు, అణచివేతకు గురవుతున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి స్థానిక సంస్థల నిధులు దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల చేత ఎన్నికై వచ్చిన నాయకులను అవమానిస్తున్నారని ఆమె అన్నారు. చట్టపరంగా స్థానిక సంస్థలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆరోపించారు. కేసులకు భయపడి చాలా మంది నేతలు బయటకు రావడం లేదని, బీజేపీతో మంతనాలు సాగిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆమె చెప్పారు. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ ఒక్కొక్కరుగా వచ్చి చేరతారని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

మహిళలు ఇలా ఉండాలి

డా. శ్రావణి తన సొంతూరులో పుట్టిన ఆడపడచు అని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆత్మాభిమానం చంపుకోకుండా బీఆర్ఎస్ వీడి, బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు, మహిళ అంటే ఇలాగే ఉండాలని అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనకు నచ్చిన మున్సిపాలిటీలకు తప్ప ఏ ఇతర మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం లేదని వివేక్ ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న శ్రావణిని వేధించి తీవ్ర ఇబ్బందులు పెట్టారని, ఆమె బీజేపీలో చేరడం శుభపరిణామం అని వివేక్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement