– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
కేస్‌షీట్లన్నీ రాసేసి అడుగున కె. జగదీష్ అనే సంతకం జిలేబీ చుట్టల్లా రకరకాల వంపుల్తో పెట్టేసి పెన్ను జేబులో పెట్టుకున్నాను. ఈ సంతకం ఎప్పుడో మెడిసిన్ సెకండియర్లో అలవాటైంది. అప్పట్నుంచీ ఏయేటికాయేడు మరిన్ని వయ్యారాలు పోతూ ఆఖరికి వానపాటలో వాణీవిశ్వనాథ్‌లా తయారైంది.
‘పెద్దరికం వచ్చేస్తోంది. ఇహ ఈ కుర్రచేష్టలవీ మానేసి కాస్త పొందిగ్గా, బాధ్యతగా పెట్టాలి సంతకం!’ అనుకున్నాను కళ్లజోడు సర్దుకుంటూ.
పొట్టి సంతకం కూడా అంతే! విజయరామగజపతి సింహాసనానికి అటూఇటూ ఉండే లతలూ, నగిషీల్లా తెగ తిప్పుతాను.
చదువుకునే రోజుల్లో మనకి సంతకాలు పెట్టే అవసరాలేముంటాయి? అటెండెన్స్ రిజిస్టర్లో కూడా పేర్లు పిలిస్తే పలకడమే కదా? కానీ నాకు అత్యంత ఇష్టమైన విషయం..
…………….
అటెస్టేషన్ సంతకాలు పెట్టడం!
అందుకే తొంభై ఎనిమిదిలో ప్రభుత్వోద్యోగంలో చేరగానే ముందుగా ఒక గ్రీనింక్ పెన్ను కొనేశాను. ఎవరైనా ఉద్యోగం గురించి కదిపితే అవీ ఇవీ మాటాడుతూ చివరిమాటగా ‘అంటే మేం బోర్న్ గజిటెడ్ కదా?’ అని తప్పనిసరిగా మంగళహారతి పాడేవాణ్ణి. వైజాగ్‌లో ప్రతీ బస్సూ పాతపోస్టాఫీసుకే వెళ్లినట్టు అన్ని టాపిక్సూ అక్కడికే తీసుకుపోయేవాణ్ణి. వినేవాళ్లు ఏమనుకుంటారో అన్న ధ్యాసైనా ఉండేదికాదసలు.
ఎవరైనా అటెస్టేషన్ల కోసం వస్తే బావుండునని కొన్నాళ్లు ఎదురుచూశాను కూడా! మనం హాస్పిటల్ భవనం మొత్తంలో అత్యంత గోప్యమైన రహస్యమందిరం… అంటే ఆపరేషన్ థియేటర్లో జహాపనా టైపులో ముసుగేసుకుని కూర్చుంటే మన దగ్గరకెవడొస్తాడు సంతకాలకి?
ఆ సూక్ష్మం బోధపడ్డానికి కాస్త సమయం పట్టింది. అనెస్తటిస్టులకు అటువంటి కోరికలు నిషిద్ధమని తలచి ఓ పొడుగాటి దళసరి పాత శుభలేఖ తీసుకుని దాని వెనకాల నా సంతకం నేనే అందంగా, ఆకర్షణీయంగా, ఒక్కోసారి సెక్సీగా కూడా పెట్టుకుంటూ చూసుకుని మురిసిపోయేవాణ్ణి.
ఎవరైనా గదిలోకొచ్చి అవన్నీ చూసి ‘మీ సంతకం మహత్తరంగా ఉంద’ని అంటారేమోనని ఆశపడేవాణ్ణి. తీరాజేసి వాళ్లేమో ‘సార్, మీ దగ్గర గ్రీనింక్ ఉందా? అయ్యో ఇందాక అల్లా పిడియాట్రిక్స్ మేడమ్ దగ్గర లేదంటే కొత్తది కొనితెచ్చాం సార్ అటస్టేషన్‌కీ!’ అంటూ ఆల్రెడీ కూలిపోయిన బిల్డింగులో ఇంకో డైనమైట్ పడేసి వెళిపోయేవారు.
ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఏమయ్యిందంటే ఆర్థోపెడిక్స్ డాక్టర్లు ఇద్దరూ రాలేదు. అదుగో ఆరోజు నాకొక ఫోనొచ్చింది, ‘మిమ్మల్ని అర్జెంటుగా ఆర్థో ఓపీకి రమ్మనమంటున్నా’రని!
నేనిలా ‘అవుటాఫ్ ద బాక్స్’ వ్యవహారాల పట్ల అనురక్తి కలిగినవాణ్ణి కావడం వల్ల వెంటనే ఓటీ బట్టల్ని విప్పేసి, ఈడ్చికొట్టి నా సివిల్ డ్రెస్సుని అందంగా టక్ చేసుకుని, జూనియర్ డాక్టరొకడి దగ్గర తెల్లకోటొకటి అప్పడిగి తొడుక్కుని ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందీ…’ పాట పాడుకుంటూ ఆర్థో ఓపీకి బయల్దేరాను.
దారిలో ఒకరిద్దరు ఆఫీసువాళ్లు, నర్సుపిల్లలు నన్ను విష్ చేశారుగానీ వారి కళ్లల్లో నాపట్ల అనురాగంకంటే ‘నీకిదేం రోగం?’ అన్న ఫీలింగే ఎక్కువ కనబడింది నాకు. ఎప్పుడూ ఆకుపచ్చ బట్టల్లో ఆకుచాటు అరటిగెలల్లా దాక్కునే అనెస్తటిస్టులు ఇలా మంచి బట్టల్లో అందంగా కనబడితే ఈ సమాజం తన కళ్లు సూదీదారంతో కుట్టుకుంటుందన్న విషయం బోధపడింది. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఓపీ దగ్గరకి చేరుకున్నాను.
ఆరోజు ఓపీలో జనం చాలామంది ఉన్నారు. లైన్లో నిలబడి కొట్టేసుకుంటున్నారు కూడా. ‘అసలే కాలూచెయ్యీ ఇరిగే వచ్చారా? ఇలా కొట్టుకుంటే ఉన్నయి కూడా ఇరుగుతా’యంటూ అందర్నీ శాంతపరుస్తున్నాడు వార్డ్ బోయ్ పెంటయ్య.
వాళ్లందర్నీ చూసేసరికి కంగారొచ్చేసి ‘ఇంత ఓపీ ఏంటి పెంటయ్యా?’ అన్నాను గుటకలు మింగుతూ.
‘గంటలో కొట్టీయొచ్చు సార్!’ అన్నాడు గుట్కా మింగుతూ.
‘అంతంత కట్లేసుకొచ్చారు, గంటలో ఎలా అయిపోతుందీ? మరీ చెప్తావు?’ అన్నాను లాలనగా.
‘మీరలా కూసుని అందరికీ డైక్లోఫినాక్ రాసిచ్చీండి సార్, నే పొడిచేస్తాను! అంతకంటే ఇంకేటీ చెయ్యకండి!’ అన్నాడు స్టెతస్కోపు, బీపీ డబ్బా, థర్మామీటరూ దాచేస్తూ. నేనింకా అందరికీ బీపీలవీ చూసి, నాడీ, వేడీ పరీక్షిద్దామనుకుంటున్నా! పెంటయ్యకి నా విషయం తెలుసు. అంత రష్‌లో అవన్నీ పెట్టుకుంటే సాయంత్రం వరకూ అక్కడే పడుండాలి.
ఇంతకుముందు ఓమారిలాగే మెడికల్ ఓపీలో డాక్టర్లెవరూ లేరంటే వెళ్లికూర్చుని ఒక్కొక్కరినీ సాంగోపాంగంగా పదేసి నిముషాలు చూశాను. ఆరోజు అందరూ తృప్తిగా బీపీలు, గుండెతనిఖీలు చేయించుకుని ఇళ్లకు వెళ్లారని, అయితే ఆ మర్నాటినుంచే అసలు సమస్య మొదలయిందనీ చెప్పుకున్నారు.
‘నిన్న ఎవరో పొట్టిగా ఉన్న డాట్రొకతను వచ్చి సక్కగా మాకు బీపీ గీపీ చూసేరండీ! ఇయాల రాలేదా ఆయన?’ అని వాదన మొదలెట్టార్ట!
ఆ మొత్తం గొడవలో అంత ఆత్మీయంగా బీపీలవీ చూడటం విషయం మావాళ్లకు నచ్చలేదు……
‘పొట్టిగా…’ అన్నమాట నాకు నచ్చలేదు.
కానీ పెంటయ్య చెప్పింది అబద్ధమేమీ కాదు. వాళ్లలో చాలామంది ఇంజెక్షన్ బ్యాచే! చాలా తక్కువమందికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్లు అవసరపడ్డాయంతే!
ఇక అయిపోయింది ఓపీ అనుకుంటోంటే అప్పుడొచ్చారు ఓ అరడజనుమంది. వాళ్లందరి చేతుల్లోనూ ఏవో సర్టిఫికెట్లు కనబడుతున్నాయి.
‘బహుశా నేనిప్పుడు వాటిమీద సంతకాలవీ పెట్టాలనుకుంటా!’ అని ఉవ్విళ్లవీ ఊరుతూ ఉండగా నా గుండెకు ఎడమవైపు గుట్టుగా దాగివున్న గ్రీనింక్ పెన్ను ఆనందంతో ఓ రెండు ఇంకు చుక్కల్ని కక్కింది.
వాళ్లు నాచుట్టూ చేరగానే అందరి దగ్గరనించీ కాయితాలన్నీ తీసుకుని పెన్ను క్యాప్ తీసి, స్టైల్‌గా దులపబోతోంటే చేతులనిండా పీవోపీ పిండితో డ్రెస్సింగుల గదిలోంచి పెంటయ్య వచ్చాడు.
‘సార్, అయన్నీ మీరు సైన్ చేసీకండి. అదంతా జాగర్తగా చూడాలి. హాండీకేప్ పర్సంటేజదీ చెక్ చెయ్యాల్సార్! రేపు పెద్ద సారొచ్చాక చూస్తార్లెండి. సోంవారం రావద్దురా అనీసి ఈళ్లకి ఎన్నిసుట్లు చెప్పినా ఇనర్సార్!’ అంటూ నా సంత‘కల’ని మధ్యలోనే తుంచేశాడు.
మరిక చేసేదేంలేక పెన్ను మడిచి మళ్లీ జేబులో పెట్టేసుకున్నాను.
‘జోబీ పచ్చగా అయిపోయింది సార్! చూస్కోండి, కక్కుతున్నట్టుంది పెన్ను!’ అన్నాడు
అది ఆకుపచ్చ కన్నీరని ఎలా చెప్పను? పూజకు పనికిరాని పువ్వని విన్నాంగానీ అటెస్టేషన్లకి అవసరంలేని అనెస్తటిస్టు అని వినివుండం కదా?
ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా నాకు ఈవూళ్లో కాస్త పరిచయాలవీ పెరిగిన పిమ్మట కొంతమందికి నేను కూడా సంతకాలకి పనికొస్తానని బోధపడింది. ఆధార్ అడ్రస్ మార్చుకోవడాలు, ఆర్మీకి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇలా రకరకాల కారణాలతో జనం రావడం మొదలయింది.
ఆవేశంలో పెట్టాల్సిన వాటికంటే ఓ రెండు మూడు ఎక్కువ సంతకాలు పెట్టేసేవాణ్ణనుకుంటా, అవి చెల్లవంటూ మర్నాడు మళ్లీ వేరే సెట్ తెచ్చుకుని తయారయ్యేవారు. ఇలా కొంతకాలం నడిచాక మనకి ప్రమోషనొచ్చింది.
ఇక చూస్కోండి… రోజూ ఆపరేషన్ థియేటర్‌లో మందూమాకుల స్టాకు ఎంతుంది, ఏమేంలేవు వివరాలన్నీ పద్ధతిగా రాసిన పెద్దపెద్ద బౌండు పుస్తకాలు పట్టుకొచ్చి నాచేత సంతకాలు చేయించసాగారు. మొదట్లో అవన్నీ సరిగ్గా గమనించకుండా సంతకాలు చేసిపడేసేవాణ్ణి.
తీరాజేసి ఆపరేషన్ మధ్యలో ఎవరైనా ‘ఫలానా ఇంజెక్షన్ ఎందుకులేదూ?’ అని అడగంగానే సిస్టరేమో ‘స్టాకు లేదని సారుకి తెలుస్సార్! ఆయన సంతకం పెడతానే ఉన్నారు రోజూ!’ అని పాత సినిమాల్లో అమాయకుడైన కాంతారావుని అక్రమ కేసులో ఇరికించినట్టు ఇరికించేసేవారు.
ఇహ ఇలా బభ్రాజమానంలా ఉంటే లాభంలేదని అప్పటినుంచి అన్నీ ఒకటికి పదిసార్లు చెక్ చేసిన తరవాతే సంతకాలు పెట్టసాగాను.
ఇక దైనందిన జీవితంలో రోజూ ఉదయాన్నే బయోమెట్రిక్ పరీక్ష విజయవంతంగా ప్యాసయినా, అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు మాత్రం తప్పనిసరి.
ఒక్కోసారి ఎప్పుడైనా… (నిజంగానే ఎప్పుడైనా…) హాస్పిటల్‌కి వెళ్లడం ఆలస్యం అయ్యేలా ఉందని అనుమానం వస్తే మనకి అస్మదీయులైన మేడమ్స్‌లో ఎవరో ఒకరికి ఫోన్ చేసి రహస్యంగా చెబుతాను….
……………. ……..
కాస్త నా సంతకం పెట్టెయ్యమని!
‘ఏవిఁటండీ మీరు మాట్టాడేది? ఓ… తెగరాసేస్తారు సూక్తులూ సూత్రాలూ? అయితే మీరు ఫేస్‌బుక్‌లో కాశీనాథుని విశ్వనాథూ, హాస్పిటల్లో మాత్రం పూరీ జగన్నాథూనన్నమాట! హన్నా!’ అని అప్పుడే తీర్మానాలమీద సంతకాలవీ పెట్టెయ్యకండి. ఏదో పుష్కరానికొకసారి ఇలాంటి పుణ్యకార్యాలకి ఒడిగడుతూ ఉంటానంతే!
అడక్కడక్క ఇలా అడిగితే తీరాజేసి ఆవిడేమంటుందో తెలుసా?
‘సార్, నావల్లకాదు. మీ సంతకం పెట్టడం చాలా కష్టం. ఆ మెలికలేంటండీ బాబూ? ఓ వారం ప్రాక్టీస్ మానేసి ప్రాక్టీస్ చేసినా పెట్టలేను. నన్నొదిలెయ్యండి!’ అంటూ తప్పించేసుకుంటుంది.
అసలు సంతకవఁనేది ఎలావుండాలో చిన్నతనం నుంచీ నేర్పించాలి. అదికూడా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదుగనక మన సంతకాన్ని కాస్తంత సాధనతోనైనా మరొకరు పెట్టెయ్యగలిగేంత సులువుగా అలవాటు చేసుకోవాలి.
అలాగని కొందరు మరీ క్లుప్తంగా పెడతారు.
ఆ లాబ్ అమ్మాయి అన్నపూర్ణకి కార్తీకదీపం సీరియల్లో దీపలా ఎందుకన్ని కష్టాలో అని ఆరాతీస్తే తెలిసిందేమిటంటే తన సంతకమే తనపాలిట శాపమై పరిణమించిందని!
తను చాలా అదుపని తెలుసుగానీ ఇంత పొదుపని తెలీదు.
‘ఎ’ అని పెడుతుంది!
మనందరికీ ఎ అంటే ఆబ్సెంటని తెలుసు. తనకుమాత్రం చిన్నప్పుడు స్కూల్లో ఎ ఫర్ యాపిల్ అని నేర్పిస్తే ఇంటో వాళ్ల నాన్న ఎ ఫర్ అన్నపూర్ణ అని సరదాకి నేర్పించారనుకుంటా! దాన్ని తను సీరియస్‌గా తీసుకున్నట్టుంది!
ఆ పిచ్చ సంతకం చూసి ఈవిడగారు నెల మొత్తం ఆబ్సెంటనుకుని మేడమీద గుమాస్తా పిల్ల జీతం రాయడం మానేసింది! దాంతో కళ్లనిండా ఏడ్చుకుంటూ, కాళ్లురెండూ ఈడ్చుకుంటూ రెండంతస్తులూ ఎక్కి, ఎక్కిళ్లమధ్య తన కష్టాన్ని కలబోసుకుంది. అప్పుడు అసలు విషయం బోధపడి, అదంతా సరిదిద్దిందిట!
ఇన్నాళ్లూ తను వచ్చినా రానట్టే అనుకున్నారందరూ!
ఇకపై తను రాకపోయినా వచ్చినట్టే! అంతేకదా? ఏవిఁటో ఈ సంతకంరాని సంత!
మా సర్జరీ ప్రొఫెసరొకాయన ఉండేవాడు. ఆయనచేత రికార్డుల్లో సంతకం పెట్టించుకోవాలని వెడితే గ్రీనింకు పెన్ను మాచేత కొనిపించేవాడు. అలా ఎన్ని కూడబెట్టాడో ఆ ఎవర్‌గ్రీన్ ప్రొఫెసర్! ఇంతాజేసి సంతకాన్ని చిన్న స్పీడ్ బ్రేకర్లా మొదలెట్టి, ఓ అరకిలోమీటరు హైవేలా సాగదీసి, మళ్లీ చివర్లో రోడ్డుమీద ఏదో గుంటపడినట్టు కిందకి దింపేసేవాడు. అదిట సంతకం! ఆ సంతకాన్ని మావాళ్లందరూ చాలా సులువుగా నేర్చేసుకున్నారు. సర్జరీ కష్టంగానీ ఫోర్జరీ ఎంతసేపు నేర్చుకోవడం?
అందుకే ఇలాంటి గొడవలేవీ రాకుండా నేను పొట్టి సంతకం కూడా చాలా అందంగా ప్రాక్టీస్ చేశాను… జెకె..అని! అమ్మాయిలు జడకి పెట్టుకునే క్లిప్పులా ఉంటుంది చూడ్డానికి!
ఇక ముక్తాయింపు:
పెళ్లికి ముందు కొన్నాళ్లపాటు ఉత్తరరామాయణం నడిచింది మామధ్య. నేను మొట్టమొదట రాసిన ఉత్తరంలో ఫార్మల్‌గా ఒక్కముక్క కూడా రాయలేదు. సంతకం కూడా నా పేరు కాకుండా ఏదో రొమాంటిక్ ఫీల్ వచ్చేలా రాసి ముగించాను.
తను రాసిన తిరుగుటపా మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్ల నిమిత్తం పై అధికారులకు సమర్పించుకున్న వినతిపత్రంలా ఉంది. అది చదివి నాకు ఫ్యూజ్ కొట్టేసింది. ఆనక తనకి నచ్చజెప్పి ఉత్తరాలెలా రాయాలో సెషన్స్ నిర్వహించాను.
అసలు ప్రేమలేఖంటే కవర్‌లోంచి పొగలవీ వస్తూండాలి. ఓపెన్ చేస్తే చెయ్యి కాలిపోవాలి. ఆరంభంలో సంబోధనకే సగమూ, అడుగున సంతకం చూడగానే ఇంకోసగమూ పడిపోవాలి!
అదీ విషయం! సంతకాల మీద కూడా ఇంత రాయొచ్చని మొదలెట్టాక తెలిసింది.
ఆదివారం హాయిగా గడపండి!
– కొచ్చెర్లకోట జగదీశ్