Saturday, November 23, 2024

Big Story: రెట్టించిన ఉత్సాహం, ఢిల్లీ వేదికగా వ్యూహం.. సుబ్రహ్మణ్యస్వామి, టికాయత్‌తో కేసీఆర్​ భేటీ

తొలి రెండు రోజులు స్థబ్దుగా ఉన్న సీఎం ఢిల్లీ టూర్‌ మూడో రోజు స్పీడందుకుంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వేదికగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకు మరో మూడు రోజులు ఆయన ఢిల్లీలోనే మకాం వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈలోగా యూపీ ఎన్నికలు పూర్తయ్యాక, అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని భేటీలు నిర్వహించే యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫ్రంట్‌కు కావాల్సిన సరంజామాను ఆయన సిద్దం చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గురువారం కీలక నేతలతో భేటీలు జరగ్గా సీఎం కేసీఆర్‌ నేరుగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:వాస్తవానికి సీఎం కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై ఎప్పటినుంచో విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం వేదికగా ప్రధాని మోడీ వీడియో క్లిప్లింగ్‌లను ప్రదర్శించి మరింత తీవ్ర స్వరంతో విమర్శలు చేశారు. ప్రదాని మోడీని తెలివిలేని ప్రధాని అని, కేంద్రానిది తెలివిలేని ప్రభుత్వమని విమర్శలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ నేతల అవినీతి చిట్టా తనవద్ద ఉందని, సర్టికల్‌ స్ట్రయిక్‌కు చెందిన సాక్ష్యాలను బైట పెట్టాలని పలు ఆరోపణలు, డిమాండ్లు చేశారు. ఈ దిశలోనే మొదటినుంచీ బీజేపికి వ్యతిరేకంగా ఉన్న మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. బీజేపి ముక్త్‌ భారత్‌కు సిద్దం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ పిలుపుతో మహారాష్ట్రకు వెళ్లారు. ఆయన కేసీఆర్‌జీ మీరు చాలా గొప్పగా పోరుడుతున్నారు. సరైన సమయంలో గళం విప్పారని ప్రోత్సహించారు. ఈ దేశాన్ని విభజన శక్తులనుంచి కాపాడుకునేందుకు మీరు పోరాటం కొనసాగించండి అని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని దేవేగౌడ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇలా సీఎం కేసీఆర్‌కు దేశంలోని బీజేపియేతర శక్తులు, నేతలు, పార్టీలనుంచి భరోసా పెరడగంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ దిశలోనే ఢిల్లీ టూర్‌లో బాగంగా గురువారంనాడు సుబ్రహ్మణ్య స్వామి, టికాయత్‌లను కలిశారు.

జాతీయ కూటమి దిశగా…
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పర్యటనపై తీవ్ర ఆశక్తి కనిపిస్తోంది. ఈ భేటీలో ఆయన పలువురు ముఖ్య నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమవుతారని వార్తలు చక్కెర్లు కొట్టాయి. కాగా రెండు రోజులుగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో కనిపించని సీఎం కేసీఆర్‌ గురువారం మూడో రోజు సుబ్రహ్మణ్యస్వామి, రాకేష్‌ టికాయత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భేటీ అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేష్‌సింగ్‌ టికాయత్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృసి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అమలులోకి తెచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన రైతు ఉద్యమంలో పలు సందర్భాల్లో టికాయత్‌ ప్రధాని మోడీ, బీజేపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టికాయత్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం కేసీఆర్‌ రెండు గంటలకుపైగా ఆయనతో సమావేశమై పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు అనుకూల విధానాలు అమలవుతున్నాయని టికాయత్‌ ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతులకు 24 గంటలు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నారని పొగడ్తలు గుప్పించారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రైతాంగానికి ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ప్రంట్‌ ఏర్పాటు గురించి చర్చించలేదని, తమది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగంలో దేశంలో అనేక సంక్లిష్టతలను, తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం నూతన విధానం రావాలన్నారు. ప్రత్యామ్నాయ విధానాల కోసమే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని టికాయత్‌ తెలిపారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా దేవంలోని ముఖ్యమంత్రులందరినీ కలుస్తానని, ఉద్యమంలో చనిపోయిన రతైలు వివరాలను త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరులైన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పరిహారం అందిస్తారని ఆయన వెల్లడించారు. త్వరలో వ్యవసాయ రంగం, రైతుల కోసం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నామని టికాయత్‌ పేర్కొన్నారు.

ఈనెల 1న డిల్లీకి…
కాగా సీఎం కేసీఆర్‌ గతనెల 28న ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన దంత వైద్యం చేయించుకునేందుకుగానూ ఢిల్లీకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. బుధవారం కూడా ఆయన తన వ్యక్తిగత వైద్యురాలు పూనియాను కలిసినట్లు సమాచారం. కాగా సీఎం కేసీఆర్‌ సతీమణి శోభమ్మ కూడా బుధవారం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలో కూడా కరోనానుంచి కోలుకున్న తర్వాత ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

యాంటీ బీజేపి వ్యూహం అమలులో భాగమే…
జాతీయ స్థాయిలో యాంటీ బీజేపి వ్యూహం ఖరారు దిశగా రాజకీయ వ్యూహకర్త పీకే సూచనల మేరకే సీఎం కేసీఆర్‌ ఉత్తరాదిలో పర్యటనకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి దేశరాజకీయాలు, యాంటీ బీజేపి విధానాలపై ఏకాభిప్రాయం దిశగా సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారని గతంలోనే చర్చ జరిగింది. శాసనసభా బడ్జెట్‌ సమావేశాల ముగింపు, యాదాద్రి ఆలయ పున:ప్రారంభం తర్వాత జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్‌ చేసేలా సీఎం కేసీఆర్‌ యాక్షణ్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నారని, ఈలోగా ఐడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వేగం పెంచనున్నారని సమాచారం. ఇందుకు త్వరలో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేయనున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వసంత విహార్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు సమయం ఎక్కువ పడుతుందని, ఈలోగా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు యోఇస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో సీఎం కేసీఆర్‌ సమావేశమై జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మేధోమథనం జరపనున్నారు. ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని పార్టీలకు చెందిన ప్రభుత్వాలే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రాల హక్కులకు, అధికారాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని బీజేపీయేతర సీఎంలకు ఆయన సూచనలు చేయనున్నారు. ఇందుకు గవర్నర్ల వ్యవస్థతో ఉన్న ఇబ్బందులతోపాటు, జీఎస్టీ బకాయిలు, 42వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులను నాన్‌ బీజేపి స్టేట్స్‌కు కేంద్రం వర్తింపజేయకపోవడం వంటి అంశాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించనున్నారు. ఉమ్మడి జాబితాలోని అధికారాలతోపాటు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, జోక్యం చేసుకునే అధికారాలతో సహా, ఫెడరల్‌ విధానాలను జాతీయ స్థాయిలో మరింతగా వినిపించి లాభం పొందేలా యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement