హైదరాబాద్, ఆంధ్రప్రభ: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల మొదటి విడత కౌన్సిలింగ్‌లో మొదటి ప్రాధాన్యత కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 72శాతం మేర 53, 092 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యత ద్వారా 19, 909 విద్యార్థులు సీట్లు పొందారని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. రెండో విడత దోస్త్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఈ నెల 16 నుంచి 27వరకు కొనసాగుతాయన్నారు. జూన్ 30 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. దోస్త్ -2023 డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలపై ఆయన శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఆర్ట్స్ లో 771 మంది, కామర్స్ లో 39, 251 మంది, లైఫ్ సెన్సెస్‌లో 16, 434 మంది, ఫిజికల్ సైన్సెస్‌లో 13, 468 మంది, డేటా సైన్స్ లో 1955 , డీ ఫార్మసీలో 254 మంది మొత్తం 73, 220 మంది విద్యార్థులు సీట్లు పొందారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో 68, 494 మంది, తెలుగు మీడియంలో 4226 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. మొబైల్ ఫోన్ నుండి ఎస్‌ఎంఎస్ చేయడం ద్వారా విద్యార్థులు సీట్లు పొందిన వివరాలను పొందొచ్చని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు అవసరాన్నిట్టి రూ.500 లేదా 1000 చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ను ఈ నెల 16 తేదీ నుంచి 25వరకు చేసుకోవాలన్నారు.
ఈపాస్ ఫీజు రియంబర్స్ మెంట్ అర్హత పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు సీటును కోల్పోతారని, దోస్త్ లో రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందన్నారు. మెరుగైన సీటు కోసం చూసే విద్యార్థులు తదుపరి దశలో వెబ్ ఆప్షన్లను స్లైడింగ్ ద్వారా పూర్తి చేయాలన్నారు. ఫేజ్-3లో సీట్ల కేటాయింపు తర్వాత మాత్రమే విద్యార్థులు ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్ 3లలో సీట్లు పొందిన విద్యార్థులు జులై 15నాటికి రిపోర్ట్ చేయాలన్నారు.