దోస–బిర్యానీ దోస్తీ కట్టాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియా, పాకిస్తానీ స్టూడెంట్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటా తమ అభిప్రాయాలను పంచుకుని ఫ్రెండ్స్ అయ్యారు. భారతదేశంతోపాటు పాకిస్తాన్ కూడా తమ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటోంది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వర్చువల్ యూత్ శాంతి సంభాషణలో ఆయా దేశాల సంస్కృతి, వంటకాలు, విద్య, సాంకేతికత గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో భారతీయ, పాకిస్తానీ పాఠశాల విద్యార్థులు దోస-బిర్యానీని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఆ రుచులను ఆస్వాదించారు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
భారతదేశానికి చెందిన ఎడ్యుకేషన్ ఎంటర్‌ప్రైజ్ వాల్-ఎడ్ ఇనిషియేటివ్స్, పాకిస్తాన్ ఆధారిత స్కూల్ లెర్న్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘ఎక్స్ ఛేంజ్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో 6-9 తరగతుల నుండి 20 మంది భారతీయ, పాకిస్తాన్ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, బిర్యానీ కంటే దోసె ఎక్కువ పాపులర్ కదా అనే టాపిక్ మీద సరదాగా తాము వాదించుకుంటామని, ఇట్లా మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా రెండు దేశాల సంస్కృతి, విద్య, సాంకేతికత.. మరెన్నో అంశాలపై చర్చించుకున్నామని UAE లో ఉండి చదువు కొనసాగిస్తున్న 12ఏళ్ల పాకిస్తానీ విద్యార్థిని అలీజా ఫాతిమా అన్నారు.
ఫాతిమా స్కూల్లో ఎక్కువగా ఇండియన్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటుందని, వారితో కలిసి చదువుకుంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు భారతదేశంలోని తన వయస్సు గల విద్యార్థులతో సంభాషించే అవకాశం లభించడంతో ఆమె సంతోషానికి అదుపు లేకుండా పోయింది. మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ పౌరసత్వంగా మారడానికి రెండు దేశాల భవిష్యత్తు గురించి.. శాంతియుత అవగాహన పెంచుకోవడం.. రెండు దేశాల మధ్య మంచి రిలేషన్ ఏర్పరచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ డైలాగ్ సెషన్ తమ పొరుగు దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడిందని, ఇది కచ్చితంగా తన ఆలోచనా విధానాన్ని మార్చిందని మరో విద్యార్థి హర్షిదా సునీల్ చెప్పుకొచ్చాడు. కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న సరిహద్దు ఉగ్రవాదంపై ద్వైపాక్షిక సంబంధాల మధ్య రెండు పొరుగు దేశాల విద్యార్థుల మధ్య పరస్పర చర్చ జరిగింది. ఉగ్రవాదం, శత్రుత్వం.. హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పేర్కొంది. కార్యక్రమంలో వాల్-ఎడ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు మయాంక్ సోలంకి కీలకోపన్యాసం చేశారు.