ప్రపంచమంతా ఒమిక్రాన్ ముప్పు భయం పట్టుకుంది. శరవేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని గుడ్‌న్యూస్ చెబుతున్నారు డాక్టర్ ఫహీమ్ యూనుస్. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనుస్ గుడ్ న్యూస్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ డేటా అధ్యయనం (Omicron study)చేసి.. ఆందోళన అవసరం లేదని చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కుగానే ఉందని డాక్టర్ ఫహీమ యూనుస్ తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని ఒమిక్రాన్ వేరియంట్ కేసులపై చేసిన అధ్యయనం వివరాల్ని విశ్లేషించారు డాక్టర్ ఫహీమ్. వివిధ అధ్యయాల్లో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటుందని తేలిందన్నారు. ఈ అధ్యయనంలో 91శాతం డెల్టా వేరియయంట్ బాధితులతో పోల్చి చూసినప్పుడు.. ఒమిక్రాన్ బాధితుల్లో 31శాతం మాత్రమే తీవ్ర శ్వాసకోశ వ్యాధులున్నాయని డేటాలో తేలిందన్నారు. డెల్టా వేరియంట్ సోకిన రోజులకు 7 రోజుల్లో తగ్గితే.. ఒమిక్రాన్ రోగులకు 3 రోజుల్లో తగ్గిందని అధ్యయనంలో వెల్లడైంది.
ఇక డెల్టా వేరియంట్ బాధితుల్లో దాదాపు 60శాతం మంది హాస్పిటళ్లలో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 41 శాతం మంది బాగానే ఉన్నారని తెలిసింది. డెల్టా బాధితుల్లో ఐసీయూలో చేరినవారు 30 శాతం కాగా, ఒమిక్రాన్ బాధితుల్లో కేవలం 18శాతం మంది మాత్రమే ఐసీయూల్లో చేరారు. ఇక వెంటిలేటర్‌పై డెల్టా వేరియంట్ బాధితులు 12 శాతముంటే.. ఒమిక్రాన్ బాధితులు కేవలం 1.6 శాతమే ఉన్నారని డాక్టర్ ఫహీమ్ యూనుస్ (Dr Faheem Younus) చెప్పారు. అంతేకాకుండా.. మరణాల రేటు డెల్టా వేరియంట్ బాధితుల్లో 29 శాతం కాగా, ఒమిక్రాన్ వేరియంట్‌లో 3 శాతం ఉంది. కానీ, ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్టు ఈ స్టడీ రిపోర్టు చెబుతోంది.
డెల్టా, ఒమిక్రాన్ బాధితుల సగటు వయస్సు 36 నుంచి -59 ఏళ్ల మధ్య ఉంది. ఒమిక్రాన్ గ్రూపునకు సంబంధించి సీక్వెన్సింగ్ డేటా ఇంకా అందుబాటులో రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో గత 24 గంటల్లో ఒమిక్రాన్ కేసులు 1700కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు అమెరికా, రష్యా, పోలండ్ దేశాల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.