Tuesday, November 26, 2024

కొనుగోలు కేంద్రాలు ఉంచాలా వద్దా? రాసిస్తేనే ఢిల్లీ నుంచి కదులుతాం: పీయూష్ గోయల్‌తో మంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉంచాలా వద్దా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణా మంత్రుల బృందం డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం, ఎంపీలు నామా నాగేశ్వరరావు తదితరులు పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో భేటీ అయింది. ధాన్యం కొనుగోళ్లపై కూలంకషంగా చర్చించారు. అనంతరం మంత్రులు న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను ఉంచాలా వద్దా అని కేంద్ర మంత్రిని కోరగా… రాతపూర్వక ఆదేశాలపై ఒకటి, రెండు రోజుల సమయం అడిగారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు.

రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకపోతే కొనుగోలు కేంద్రాలు కొనసాగించడం కష్టమని చెప్పారు. రైల్వే రాక్స్ కేటాయించకపోవడం వల్లే రబీ బియ్యం సప్లై పూర్తి కాలేదని వెల్లడించారు. రాక్స్ లేవనే విషయాన్ని ముందుగానే తాము లేఖలు రాశామన్నారు. తమ ముందే కేంద్ర మంత్రి రైల్వే అధికారులతో మాట్లాడారని, ఎరువుల సీజన్ కాబట్టి రైల్వే ర్యాక్స్ వాటికే ఎక్కువగా కేటాయించినట్టు రైల్వే అధికారులు చెప్పారని వ్యవసాయ మంత్రి వివరించారు. రైల్వే కారణంగా సేకరణ జరగడం లేదని కేంద్ర మంత్రికి అర్థమైందన్నారు. రాష్ట్రంలో నెలకు 10 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం ఉందని, మిల్లు పట్టి సిద్ధం చేసిన బియ్యాన్ని కేంద్రమే తీసుకెళ్లలేకపోతోందని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అంగీకరించారని, తమ ముందే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తరలింపు వేగం పెంచుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారని వెల్లడించారు. యాసంగిలో వచ్చేది బాయిల్డ్ రైసే కాబట్టి వచ్చే యాసంగిలో బియ్యం కొనేది లేదని ఆయన చెప్పారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ కొనుగోళ్ల టార్గెట్ 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) సేకరణ నేటి సాయంత్రం లేదా రేపు ఉదయానికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుందన్నారు. 10-12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని అన్నారు. ఇంకో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోత కోయాల్సి ఉందని, కొనుగోలు చేయాలంటే రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు చేసిన తర్వాత కేంద్రం చేతులెత్తేస్తే తామేం చేయాలని మంత్రి ప్రశ్నించారు. తనకు ఒకట్రెండు రోజుల సమయం ఇవ్వాలని, అధికారులతో చర్చించి చెబుతానని పీయూష్ గోయల్ చెప్పారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

రాతపూర్వక హామీ వస్తేనే ఢిల్లీ నుంచి తిరిగి వెళ్తామని, అప్పటి వరకు ఇక్కడే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. తాము రైతుల పక్షాన వచ్చామని, రాజకీయం కోసం కాదని మంత్రి పునరుద్ధాటించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు మద్దతు చర్యల కారణంగా సాగు విస్తీర్ణం, పంట దిగుబడి భారీగా పెరిగిందని సింగిరెడ్డి కొనియాడారు. ఏడేళ్ల క్రితం 35 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటే, నేడు 3 కోట్ల టన్నులకు చేరుకుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సొంత నిధులతో కట్టుకున్నామనే విషయాన్ని కేంద్ర కూడా చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డ అయిన కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలు పీయూష్ గోయల్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని, కిషన్ రెడ్డి అనవసర రాద్దాంతం మానుకోవాలని నిరంజన్ రెడ్డి హితవు పలికారు. గత రబీ (యాసంగి) బియ్యం కోటా ఇంకా పూర్తి చేయలేదని తమపై నింద మోపుతున్నారని విమర్శించారు.

కేంద్ర అధికారులు సరిగ్గా పని చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాతపూర్వకంగా హామీ ఇచ్చాకే ఇక్కణ్నుంచి వెళ్తామని ఎర్రబెల్లి నొక్కి చెప్పారు. ర్యాక్స్ విషయంలో తలెత్తుతున్న సమస్యలను గతంలోనూ కేంద్ర మంత్రికి వివరించామని ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. వెంటనే ర్యాక్‌లను కేటాయించాలని తమ ముందే రైల్వే మినిస్టర్‌కు పీయూష్ గోయల్ సూచించినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement