మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది. అవసరం లేకుండా వచ్చిన ఉప ఎన్నిక ఇది. బావ చెప్పిండనో, బావమరిది చెప్పిండనో ఎవరికిపడితే వారికి ఓట్లు వేయొద్దు. ఆలోచించి ఓటు వేయండి. లేకుంటే ఆగమైతం, గోసపడుతం.. అన్నారు సీఎం కేసీఆర్. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఇవ్వాల చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
కొంతమంది బోగర్‌గాళ్ల మాటలకు లొంగిపోయి వందల కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామన్నా వారి మాటలకు లొంగకుండా తెలంగాణ బిడ్డలుగా వారి సత్తా చూపారు నలుగురు ఎమ్మెల్యేలు. దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టించి ఇప్పుడు మన ముందు నిఖార్సన ఎమ్మెల్యేలుగా మన ముందు నిలబడ్డరు. ఇట్లాంటి వాళ్లే ఇప్పుడు రాజకీయాలకు కావాల్సింది. ఈ వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి, శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలను కూలగొట్టే పని ఇది మంచిదా అని ప్రశ్నించారు.
రెండు సార్లు ప్రధానిగా అవకాశం వచ్చిన నరేంద్ర మోదీగారు.. మీకు ఇంకేం కావాలని ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అని సీఎం కేసీఆర్ చండూరు సభ వేదికగా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఉన్న వారు హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సాగించిన తీరు దుర్మార్గమన్నారు. దీని వెనకాలు ఉన్న వారు ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందేనని, శిక్ష అనుభవించాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్.