Tuesday, November 26, 2024

డ్ర‌గ్స్ కేసులో ఎవరినీ వదిలిపెట్టం: సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైద‌రాబాద్ సిటీలో కలకలం రేపిన డ్రగ్స్‌ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదిలి పెట్టబోమ‌ని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దాడిలో దొరికిన 45 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్‌ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్‌ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్‌ సీఐ శివచంద్రపై సస్పెన్షన్‌ వేటు వేసినట్టు కమిషనర్‌ తెలిపారు. అదే విధంగా ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌ మెమో జారీ చేశామని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

మరో పక్క డ్రగ్స్‌ కేసు దర్యాప్తు, పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, ఇతర వస్తువులతో పాటు లభించిన సమాచారంపై ఆనంద్‌ సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. కేసును అన్ని రకాలుగా విచారించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా కూడా విశ్లేషించాలని అధికారులకు సీపీ సూచించారు. ప్రముఖుల పిల్లలున్నందున కేసును పక్కదారి పట్టించే అవకాశాలున్నాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటినీ పటా పంచలు చేసి దోషులు ఎవరుంటే వారిపై చర్యలు తీసుకునేలా దర్యాప్తు జరపాల్సిందని అధికారులను సీపీ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement