హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న టీఎస్ ఆర్టీసీతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని సంస్థ ఎండీ వీసీ సజ్జన్నార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బందితో ఘర్షణకు దిగినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనంపై వెళుతూ టీఎస్ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిధాని డిపోకు చెందిన బస్సు 104-ఎ రూట్లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై సజ్జన్నార్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై ఇలాంటివి చేయొద్దని హెచ్చరించారు.
ఈ వీడియోపై సజ్జన్నార్ తన స్వంత అకౌంట్ వేదికగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”వెర్రి వేయి విధాలంటే ఇదే… సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి… ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండి” అంటూ సూచించారు. బస్సులపై ఇలాంటి ఆకతాయి చేష్టలకు దిగితే సంస్థ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కాగా, ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల విధ్వంసంతో పాటు విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. కొద్ది నెలలక్రితం నగరంలోని మెహిదీపట్నం ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళతున్న ఓ యువకుడు తనకు సైడ్ ఇవ్వలేదన్న ఆగ్రహంతో డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగాడు.
ఈ ఘటన కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో సంస్థ సదరు ద్విచక్ర వాహనదారునిపై చట్టపరమైన చర్యలకు దిగింది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు యువకునిపై కేసు నమోదు చేశారు. ఇలా నగరంలో ఏదో ఒక ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లు, కండక్లర్లపై వాహనదారులు దాడులకు దిగడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కూడా ఇదే తరహా ఘటనలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ దారి ఇవ్వలేదని అకారణంగా ఓ యువకుడు ఆ బస్సు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదనీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎండీ సజ్జన్నార్ హెచ్చరించారు.