Monday, November 18, 2024

గృహ‌హింస కేసు : క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కోడ‌లుకు రూ.కోటి ప‌రిహారం

గృహహింస కేసులో విజ‌య‌వాడ‌లోని ఒక‌టో చీఫ్ మెట్రోపాలిట‌న్ కోర్టు ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కోడలుకు రూ.కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మీ కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి నాగరాజు తల్లి విజయలక్ష్మీకి ఇష్టం లేదు. కానీ వివాహం జ‌రిగిన త‌ర్వాత కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీలక్ష్మీ కీర్తి 2013లో ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే వివాదాల కారణంగా 2015లో తల్లీబిడ్డను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు విజయవాడలోని మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించింది. గృహ హింస పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పరిహారంతో పాటు శ్రీలక్ష్మీ కీర్తితో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. తీర్పు ఉత్తర్వులు వెలువ‌డిన మూడు నెలల్లోపు ఆదేశాలన్నీ అమలు చేయాలని.. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.


రూ.కోటి ప‌రిహారంతో పాటు నెల‌కు యాభై వేల రూపాయ‌ల‌ను భ‌ర‌ణంగా చెల్లించాల‌ని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖ‌ర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయ‌స్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఈ మొత్తాన్ని మూడు నెల‌ల్లో ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement