Tuesday, November 26, 2024

కుక్క‌ల సంర‌క్ష‌ణ స‌మాజ భాద్య‌త‌…..

”ఒక దేశం యొక్క గొప్పదనాన్ని, దాని నైతిక పురోగతిని ఆ దేశం జంతువులతో వ్యవహరించే విధానం ద్వారా అంచనా వేయొచ్చు.. – మహాత్మాగాంధీ

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌ అంబర్‌పేటలో నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్‌ మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. బాలుడ్ని వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపర్చి పొట్టనపెట్టుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ హైకోర్టు సైతం ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ ఘటన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల నియంత్రణపై ప్రజలు పెద్దెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించమంటూ స్థానిక సంస్థలకు మొరపెట్టు కుంటున్నారు. అంబర్‌పేట ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే కొత్తపేటలో రెండేళ్ళ బాలుడు రుషిపై కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌ గోల్కొండ ప్రాంతంలో రెండేళ్ళ బాలుడ్ని వీధికుక్కలు చీల్చి చంపేశాయి. అదే ఏడాది మేలో మూసీనది పక్కన కుల్సుంపుర సమీపంలో 12ఏళ్ళ బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. అంబర్‌పేట ఘటనకు సంబంధించి అధికారులు కూలంకుషంగా వివరాల్ని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. వీధి కుక్కల నియంత్రణకు కొన్ని చర్యలు చేపట్ట నున్నట్లు ప్రకటించింది.


సృష్టిలో కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. కానీ మేథస్సు, ఆలోచనా శక్తి ఉన్న జీవి మనిషే. తన బుద్దిబలంతో, శక్తితో మనిషి ప్రకృతిని అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇతర జీవులన్నింటిని తన అదుపాజ్ఞలకు అనుగుణంగా మార్చుకున్నాడు. తన అవసరాల కోసం ఇతర జీవుల్ని వినియోగించుకుంటున్నాడు. ఈ క్రమంలో మనిషికి అత్యంత చనువు కలిగిన జీవులు కక్కలే. మానవునికి, కుక్కలకు మధ్య 15వేల సంవత్సరాలకు పైగా సహజీవనం కొనసాగుతోంది. వాస్తవానికి కుక్కలు కూడా మాట్లాడతాయి. అయితే వాటి భాష మనుష్యలకు అర్థంకాదు. కొన్ని సందర్భాల్లో వాటి భావాలను మనిషి పసిగట్టగలుగుతాడు. కుక్కల్ని చంపడం ప్రస్తుత పరిస్థితికి సమాధానం కాదు. కుక్కలు కూడా పర్యావరణ వ్యవస్థలో ఓ భాగం. అవి భూమిపైకొచ్చిన వలస జంతువులు కాదు. అవి భూమిపై ఆక్రమణదార్లు కూడా కాదు. కుక్కల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాలతోపాటు సామాజిక సంస్థలకు కూడా బాధ్యతలున్నాయి. కుక్కలతో సహా అన్ని జీవరాశుల పట్ల కరుణ చూపడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. కుక్కల నిర్వహణకు బహుళ కోణాల విధానాల్ని గతంలోనే ప్రభుత్వాలు రూపొం దించాయి. అలాగే వీటి నిర్మూలనకు బదులు నైతిక ప్రత్యామ్నాయాల్ని కూడా రూపొందించాయి. కుక్కల్ని ప్రధానంగా పెంపుడు కుక్కలు, వీధి కుక్కలుగా వర్గీకరించొచ్చు. పెంపుడు కుక్కల సంరక్షణ బాధ్యత వాటి యజమానులదే. వాటికి ఆహారం నుంచి మందుల వరకు అన్నీ వారే భరిస్తారు. ఇక రెండోరకం వీధికుక్కలు. వీటికి యజమానులుండరు. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతాయి. వీటి సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, లేదా స్థానిక సంస్థలు భరిస్తాయి.

అమలుకాని సుప్రీం కమిటీ సిఫార్సులు
గతంలో వీధి కుక్కల నుండి పెంపుడు కుక్కల్ని గుర్తించి వేరు చేసేందుకు వీలుగా స్థానిక సంస్థలు లైసెన్సింగ్‌ విధానాన్ని అమలు చేసేవి. కుక్క యజమానులు నిర్ణీత రుసుం చెల్లించి లైసెన్స్‌ బిళ్ళను పొందేవారు. వాటిని తమ కుక్కల మెడలో కట్టేవారు. వీధి కుక్కల నియంత్రణ బాధ్యతను స్థానిక సంస్థలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపకరించేది. తరచూ వీధుల్లోని ఊరకుక్కల్ని స్థానిక సంస్థల సిబ్బంది పట్టుకునేవారు. ఈ క్రమంలో లైసెన్స్‌ కలిగిన కుక్కల్ని మినహాయించేవారు. ఇలా.. పట్టుకున్న వీధి కుక్కల్ని చంపడం ద్వారా వాటి సంఖ్యను నియంత్రించగలిగేవారు. కాగా జంతు ప్రేమిక సంఘాలు ఇలా ఊరకుక్కల వధపై న్యాయస్థానాల్ని ఆశ్రయించాయి. వీధి కుక్కల విషయంలో దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు స్పందించింది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిరిజగన్‌ నేతృత్వంలో 2016లో ఓ కమిటీని నియమించింది. సిరిజగన్‌ కమిటీ వీధికుక్కల విషయంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సూచించింది. వాటిని వెంటనే ఆమోదించి అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో పెంపుడు జంతువులకు లైసెన్స్‌లివ్వాలన్నది ఈ కమిటీ సిఫార్సుల్లో ఒకటి. అలాగే అన్ని ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌లుంచాలి. జంతువుల కాటుకు గురైన సమయంలో ఇవ్వాల్సిన చికిత్సపై వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి. వీధికుక్కలన్నింటి వేసక్టమీ చేయాలి. టెరిలైజేషన్‌ ప్రక్రియ ద్వారా వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయాలి. అయితే 2016లోనే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోనే ధర్మాసనం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర పభుత్వాలకు కుక్కలు స్టెరిలైజేషన్‌పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు ఈ ప్రక్రియ 10శాతం కూడా పూర్తికాలేదు. ఇలా ఉంటే గత మూడేళ్ళలో దేశంలో కోటిన్నర మందికి పైగా కుక్కకాటు బారిన పడ్డట్లు కేంద్ర పశుసంవర్ధక డైరీ మత్స్యశాఖ మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.

- Advertisement -

స్థానిక సంస్థలదే క్రియాశీల పాత్ర
ప్రస్తుత పరిస్థితుల్లో వీధికుక్కల నియంత్రణకు సామాజిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వీటి నిర్వహణా బాధ్యతను స్థానిక సంస్థలు భరించాలి. ఊరికి దూరంగా ఖాళీ ప్రదేశాలకు ఊరకుక్కల్ని తరలించాలి. వాటికి సమయానికి ఆహారాన్నందించాలి. ఇందుకోసం సామాజిక సేవా సంస్థలు, దాతల సహకారాన్ని తీసుకోవాలి. వీటన్నింటికి తప్పనిసరిగా యాంటీరేబిస్‌ ఇంజక్షన్లు చేయించాలి. అలాగే వేసక్టమీ ఆపరేషన్లు నిర్వహించాలి. ఆఫ్రికా దేశంలో సింహాలకు ఆహారం లభించని సమయాల్లో ప్రభుత్వమే వాటి కోసం మాంసాన్ని సిద్ధం చేసి అందుబాటులో ఉంచుతుంది. వాటి కడుపు నింపితే ఊళ్ళపై పడే ప్రమాదం ఉండదు. అలాగే దేశంలో వీధి కుక్కలకు సకాలంలో సరైన ఆహారం అందుబాటులో ఉంటే అవి మూర్ఖంగా లేదా క్రూరంగా వ్యవహరించవు.

నిపుణుల అధ్యయనం మేరకు కుక్కలు కరవడం లేదా దాడి చేసేందుకు ప్రధాన కారణం అవి అభద్రతా భావానికి లోనవడం. అలాగే ఆకలికి గురికావడం. కొన్ని సందర్భాల్లో ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. వాటి అరుపులకు జడిసి జనం పరుగులు దీస్తుంటారు. అయితే కుక్కలు మాత్రం వారి పరుగుల్ని తప్పుగా అర్థం చేసుకుంటాయి. తమపై దాడి కోసమే వారు ప్రయత్నిస్తున్నారని భావించి కరిచే వరకు వదిలిపెట్టవు. అలాగే కడుపునిండా ఆహారం లేకపోవడంతో కుక్కల మానసిక పరిస్థితి క్షీణిస్తుంది. ఎండ, చలి, వాన సమయాల్లో తగిన ఆవాసం లేనప్పుడు కూడా అవి మనుష్యులపైకి ఎగబడే ప్రయత్నాలు చేస్తుంటాయి. కుక్కలే కాదు.. పలు జంతువుల పరిరక్షణ కోసం పలు చట్టాలు చేశారు. వీటిని సమర్ధవంతంగా అమలు చేస్తే కుక్కలు జనంపై దాడి చేసే పరిస్థితులుండవు. కానీ స్థానిక సంస్థలు కుక్కలకు వేసెక్టమీ నిర్వహణా బాధ్యతను కొన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయి. ఇవి లెక్కల్లో తప్ప వాస్తవంగా వేసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం లేదు. ఇది కుక్కల జనాభా పెరగడానికి ఓ కారణమౌతోంది. ఇతర జంతువులతో పోలిస్తే కుక్కల్లో పునరోత్పత్తి సామర్థ్యం ఎక్కువ. రెండు కుక్కలు మూడేళ్ళ వ్యవధిలో 60నుంచి 80వరకు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కలిగుంటాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వేసెక్టమీ ఆపరేషన్ల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి. అలాగే వీధి కుక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా కూడా పరిగణించాలి. వాటికి ఆహారాన్ని అందించడంలో దాతలు, ప్రజాసంఘాలు తోడ్పాటునివ్వాలి. తద్వారా వీటి నుంచి సమాజాన్ని రక్షించే వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement