దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మనుషులనే కాదు జంతువులను కూడా స్టేషన్ లో పెట్టారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
మధ్యప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే, ఇండోర్ లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన కుక్కను తీసుకోని రోడ్డుపైకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో బయటకు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు ఉన్న కుక్కను కూడా స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత జైలుకు పంపారు. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.