Wednesday, November 20, 2024

టీకాతోనే 100 శాతం రక్షణ!

కొవిడ్‌ మహమ్మారి నుంచి 100 శాతం రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందజేస్తే.. మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి ఉండదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ కూడా సమర్థమైనవేననీ, ఏ టీకా తీసుకున్నా పనితీరులో లోపం ఉండదన్నారు. ప్రజల్లో టీకాలపై అపోహలు తొలగించడానికి వివిధ రంగాల ప్రముఖులతో అవగాహన కల్గించాలని, సాధ్యమైనంత వేగంగా అత్యధికులకు టీకాలను అందించాలని సూచించారు. లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అందరూ మాస్కులు ధరిస్తే అది లాక్‌ డౌన్‌తో సమానమనీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలోనూ ఇదే వెల్లడైందని తెలిపారు.

కరోనా మొదటి దశ నెమ్మదిగా మొదలైందన్నారు. ఏప్రిల్‌, మేలో ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరుకు తారాస్థాయికి చేరుకుందని తెలిపారు. అదే రెండోదశ మార్చిలో ప్రారంభమై ఏప్రిల్‌ రాక ముందే ఉద్ధృతి పెరిగిందన్నారు. 1918లో స్పానిష్‌ ఫ్లూలోనూ రెండోదశ, మూడోదశల్లో ఉన్నట్టుండి తీవ్రత పెరిగింది. అంతే వేగంగా ఆ తీవ్రత తగ్గిపోతుంది. ప్రస్తుతం మన దగ్గర కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి మే నెలాఖరు వరకూ ఇలాగే కొనసాగుతుందని అంచనా వేశారు. ఈలోగా మనం ఎంత వేగంగా ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగామనేది ముఖ్యం అని తెలిపారు. అలాగే అందరం కూడా కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామా? లేదా? అనేది అతి ముఖ్యమని చెప్పారు. ఈ రెండూ గనుక ఆచరిస్తే మే నెలాఖరుకు కొవిడ్‌ను అదుపులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం రోజుకు సగటున 15-20 లక్షల వరకూ టీకాలు ఇస్తున్నారని, ఈ సంఖ్యను 50 లక్షలకు పెంచాలన్నారు. 45 ఏళ్ల పైబడినవారికే ఇవ్వాలనే నిబంధన కూడా సరికాదన్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement