Friday, November 22, 2024

ఆకుపసరు అసలు వైద్యమా..? ఓ వైద్యుడి ప్రార్ధన

సైన్సు దేనినీ గుడ్డిగా నమ్మదు. అలాగే మూర్ఖంగా వ్యతిరేకించదు కూడా. ఎవరికైనా కావలసింది అందరూ ఆశించేది. ప్రజలందరం బాగుండడమే. కళ్లల్లోకి పడిన రెండు చుక్కల ఆకుపసరు.. క్షణాల్లో రక్తంలోకి వెళ్లి నిమిషాల్లో ఊపిరితిత్తులలో చేరి గడ్డకట్టిన న్యూమోనియాను మాయం చేసి ఆక్సిజన్ వెళ్లేలా చేసి.. పల్స్ ఆక్సీమీటర్లో పర్సెంటేజీని పెంచడం, మందులకు కాదు మహిమలకే సాధ్యం. మరి కళ్లముందే జరిగింది కదా అనే అమాయకులకు సైంటిఫిక్ ఎక్సప్లనేషన్ ఒక్కటే. 95% ఉన్న మీ పల్స్ ఆక్సీమీటర్ రీడింగ్ గట్టిగా పదిసార్లు గాలిని పీల్చాక.. 98-99%కు ఎలా వెళుతుందో చూడండి. అలాగే కంట్లో వేసిన ఆకు పసరు మంటకు గట్టిగా గాలిపీలిస్తే బాధ కారణంగా రెస్పిరేటరీ రేటు పెరిగితే కొద్ది నిమిషాలపాటూ ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరగొచ్చు. కానీ కొద్ది సేపయ్యాక మళ్లీ పాత ఆక్సిజన్ పర్సెంటేజ్‌ కే తిరిగిరావచ్చు. అందుకే మందు వేశాక గంట గంటకూ రెండురోజులపాటూ ఆక్సిజన్ పర్సెంటేజ్‌ని‌ గమనించండి. తగ్గితే మాత్రం భవిషత్తులో మీరు సైన్సును మాత్రమే నమ్మండి.

నిన్న ఆకుపసరు కళ్లలోపోయించుకొని ఆక్సిజన్ పెరిగిందని అమాయకంగా ఆనందపడ్డ మనవాళ్లు ఈరోజు మళ్లీ పడిపోయిన ఆక్సిజన్‌ లెవల్స్‌ తో ఆయా సపడుతూ క్రొత్తగా కళ్లసమస్యలను కొని తెచ్చుకొన్న హృదయ విదారక వీడియోను క్రింద ఒక్కసారి చూడండి. ఒక్క పేషంటు చెప్పిన కన్ఫెషన్ అందరికీ వర్తింపచేయడం. మనకూ అలాగే నయమవుతుందనుకోవడం అశాస్త్రీయం, అమాయకత్వం. మీకు సులభంగా అర్థమయ్యేందుకు ఓ ఉదాహరణ చెబుతాను.”నేనివ్వాళ కళ్లుమూసుకొని కారు నడిపాను. ఏ యాక్సిడెంట్ కాలేదు” అని అన్నాడట ఒకడు! ఒకసారి యాక్సిడెంటె కాకపోతే అదృష్టం. రెండోసారి కాకపోతె యాదృచ్ఛికం. వందోసారీ కాకపోతే మాత్రమే అది అద్భుతం. ఇందులోనూ ఎన్నో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. మీరస్సలు ట్రాఫిక్కేలేని రాత్రి రెండుగంటల సమయంలో కారు నడిపుండొచ్చు. అక్కడ రోడ్డు అతి స్ట్రెయిట్‌గా ఉండి ఉండొచ్చు. మీ ప్రక్కసీట్లో మిమ్మల్ని హెచ్చరించే నావిగేటర్ ఉండి ఉండొచ్చు. చివరగామీరు ఎలాన్‌ మస్క్ ఆటోడ్రైవింగ్ కారును సరదాగా నడుపుతూండొచ్చు.

శాస్త్రీయత అంటే కంటికి కనిపించిన విషయాన్ని వేర్వేరు ఆర్థిక, రోగతీవ్రతలున్న వలంటీర్లమీద వేలసార్లు వేర్వేరుపరిస్థితులలో వేర్వేరు ప్రాంతాలలో స్టడీ చెయ్యడానికి ముందే పక్కాగా రికార్డులలో నమోదు చేసుకొని ఆపైన మందుఇచ్చి వ్యాధి తీవ్రతను సైడ్ ఎఫెక్టులను పరీక్షించి బయటపడ్డ లేదా చనిపోయిన రోగుల సమాచారాన్నినిస్పాక్షికంగా విశ్లేషించి డబుల్ బ్లైండెడ్ కంట్రోల్ స్టడీ చేసి అప్పుడు…అప్పుడు..ఇది సత్యమని ఈ మందు నిజంగానే పనిచేస్తుందని ప్రపంచానికి ప్రకటించి అందరికీ అందుబాటులోకి తేవడం. అంతేకానీ అర్థంలేని ఆవేశంతో ఏపుట్టలో ఏపాముందో అన్న మూర్ఖపు వాదనతో మన భారతీయ మూలాలమీదున్న అంతులేని అభిమానంతో ఇలా అన్ని ఆకుపసర్లను సంజీవనీ మూలికలని భ్రమపడి మన ఆత్మీయులను మనమే ఎక్సపెరిమెంట్ యానిమల్స్‌గా మార్చివేస్తే…ఒక్కోసారి అది పెను ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశంవుంది. ఇప్పటికీ నర్సులు డాక్టర్లందరూ అహోరాత్రాలూ కరోనాతో మనకోసం పోరాడుతూనేఉన్నారు. కేవలం వాళ్ల పోరాట ఫలితంగానే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అతి తక్కువ వైద్య సదుపాయాలున్న మనదేశంలోనూ మరణాలశాతం వాళ్లకన్నా తక్కువుందన్నది ఒప్పుకుతీరాల్సిన నిజం.

వంద మందికి కరోనా సోకితే 85 మంది. సింపుల్ మందులతో ఇంట్లోనే బాగవుతున్నారు. హాస్పిటల్స్‌లో చేరిన 15 మందిలో 13 మందులు ఆక్సిజన్ డాక్టర్ల సాయంతో క్షేమంగా ఇంటికి తిరిగొస్తున్నారు. ఇవన్నీ కృతజ్ఞతలేకుండా మరిచిపోయి అతి అడ్వాన్స్‌డ్ మెడికల్ ఫెసిలిటీసున్న దేశాలలోకూడా జరుగుతున్న కేవలం రెండు పర్సెంట్ మరణాలను బాధ్యతన్నది లేకుండా టీవీల్లో పేపర్లలో సోషల్ మీడియాల్లో ఎలా హైలైట్ చేస్తారు. ఇప్పటికీ మనమందరం ఓపన్ మైండ్‌తోనే ఉందాం! కరోనాను కంట్రోల్‌చేసే ప్రతీ చిన్నవిషయాన్నీ

ఉపేక్షంచకుండా పరిశోదిద్దాం! ఇలా వేలంవెర్రిగా ఆకుపసర్లను పంచకుండా ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ హాస్పటల్స్‌లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఐసియుల్లో ఆక్సిజన్ మీదవున్న పేషంట్లమీద అవే ఆకుపసర్లమీద యుద్ధప్రాతిపదికన ఒక శాస్త్రీయ పరిశోధన డబుల్ బ్లైండెడ్ కంట్రోల్ తరహాలో చేద్దాం. పరిశోధనా ఫలితాలను విశ్లేషించి..మందు నిజంగా పనిచేసేదయితే అందరికీ అందుబాటులోకితెద్దాం. మనవాళ్లని మనం కాపాడుకొందాం! అంతేకానీ, అశాస్త్రీయమైన ప్రమాదకరమైన పోకడలను అంగీకరించమని నిర్ద్వందంగా చెబుదాం. ఆర్థిక లాభాపేక్ష లేకున్నాపేరు ప్రఖ్యాతుల కోసం భవిషత్తులో స్వలాభం కోసం చేసే అశాస్త్రీయ విధానాలను వ్యతిరేకిద్దాం. అలాగే వాటివలన లాభముందని పరిశోధనల్లో తేలితే మనమందరం మన స్పూర్తిగా మ్రొక్కి మరీ ఆహ్వానిద్దాం.. అంతవరకూ రాజకీయ నాయకులు,పాత్రికేయమిత్రులు స్వీయ సంయమనం పాటించి ప్రజలకు అవగాహన కలిగించాల్సిందిగా అపోహలను దూరం చెయ్యాల్సిందిగా మనసారా విజ్ఞప్తి చేద్దాం. చివరగా ఓ చిన్నమాట, మానవ జాతి మనుగడనే ప్రశ్నించి మనల్ని భూమిపైనుండి సమూలంగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నించిన కరోనా కన్నా ప్రమాదకరమైన శత్రువులైన ప్లేగు,స్మాల్ పాక్స్,పోలియో స్పానిష్ ఫ్లూలతో పోరాడి తరిమికొట్టి మానవజాతిని కాపాడింది.

- Advertisement -

“ఆధునిక వైద్యవిధానమే తప్ప మీరనుకొనే ఆకు పసర్లు కావు!” మన భారతీయమూలాలను సగర్వంగా మనం గౌరవిద్దాం. మనకోసం ప్రాణాలర్పించిన ప్రాణాలర్పిస్తున్న వైద్యులత్యాగాలను కృతజ్ణతతో మనం గుర్తిద్దాం. మనవాళ్లను కాపాడుకోవాలని మనం చేసే ప్రయత్నాలలో వాళ్లకే ప్రమాదమూ కలగకుండా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిద్దాం అంటూ డాక్టర్ గోపికృష్ణ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement