Tuesday, November 26, 2024

చెరువు మధ్యన ఇళ్ల పట్టాలా, ఎక్కడపడితే అక్కడ రాసిచ్చేస్తారా? హైకోర్టు విస్మయం

అమరావతి, ఆంధ్రప్రభ: ఇళ్ల పట్టాలకు కాదేదీ అనర్హం.. అనే తీరులో చెరువు మధ్యన పట్టా పంపిణీ చేసిన రెవెన్యూ అధికారుల నిర్వాకంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ముందు..వెనుక ఆలోచించకుండా అడిగిందే తడవుగా.. ఎక్కడపడితే అక్కడ పట్టాలు పంచేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రకృతి మానవాళి కీడును కోరుకోదని మానవులే ధ్వంసరచనకు పాల్పడుతున్నారని ఘాటుగా స్పందించింది. పర్యావరణంతో పాటు చెరువులు, జలవనరులను సంర క్షించాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం యర్రమరెడ్డి పాళ్యం గ్రామంలోని సాగునీటి చెరువును టి చిరంజీవి అనే వ్యక్తి పూడ్చివేస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదంటూ అదే గ్రామానికి చెందిన గూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ చీమలపాటి రవి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాది కొండపర్తి కిరణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. చిరంజీవి అనే వ్యక్తి చెరువు మధ్యన యంత్రాలతో చదునుచేసి ఇసుక, కంకరతో పనులు చేపట్టారని తెలిపారు. చెరువు ఆక్రమణలను నిలువరించాలని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. చెరువు మధ్యన చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోగ్రాఫ్స్‌ను కోర్టుకు సమర్పించారు. గతంలో ఆయన పట్టా పొందారని ఆ భూమిని ఇప్పుడు చదును చేసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు. అది అతని సొంత భూమి అని వాదించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చెరువు మధ్యలో పనులు జరుగుతున్నట్లు ఫొటోలు ఉంటే సొంత భూమి అని ఎలా చెప్తారని నిలదీసింది. అసలు చెరువు మధ్యన పట్టా ఇవ్వటమేంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రికార్డులను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చేనెల 13వ తేదీకి వాయిదే వేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులు, చిత్తూరు కలెక్టర్‌, తిరుపతి ఆర్డీవో, రేణిగుంట తహసీల్దార్‌, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement