Saturday, November 23, 2024

ఆన్‌లైన్ క్లాసుల ధ్రువీకరణ కోసం ఎదురుచూడొద్దు.. తక్షణమే దేశం విడిచి వెళ్లాలే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థులు తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ వీడి వెళ్లాల్సిందిగా ఆ దేశ రాజధాని కీవ్‌లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మంగళవారం జారీ చేసిన ఓ ప్రకటనలో తమకు భారత విద్యార్థుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఉక్రెయిన్‌లో మెడికల్ యూనివర్సిటీల నుంచి ఆన్‌లైన్ క్లాసుల గురించి వారంతా అడుగుతున్నారని పేర్కొంది. తాము కూడా ఆయా యూనివర్సిటీలను సంప్రదిస్తున్నామని, ఆన్‌లైన్ విద్యాబోధనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని ఎంబసీ తెలిపింది. అయితే యూనివర్సిటీల నుంచి వచ్చే ధృవీకరణ కోసం ఎదురుచూడకుండా తాత్కాలికంగా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడున్న భారత విద్యార్థులకు సూచించింది. ఇందుకు సంబంధించి ఏ సమాచారమున్నా, ఎంబసీ ఎప్పటికప్పుడు విద్యార్థులకు చేరవేస్తుందని స్పష్టం చేసింది.

మరికొన్ని అదనపు విమాన సర్వీసులు
రష్యాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం మరికొన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఎయిరిండియా సంస్థతో మాట్లాడి 3 సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, తాజాగా ఫ్లై-యూఏఈ ద్వారా 4 విమాన సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25న ఒక విమానం, 27న రెండు విమానాలు, మార్చి 6న మరొక విమానం కీవ్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకునేలా సర్వీసులు నడపనుంది. మరికొన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడుపుతున్నాయని వెల్లడించింది.

ఢిల్లీలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వ హెల్ప్‌లైన్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో తమ రాష్ట్రానికి చెందినవారి కోసం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని చత్తీస్‌గఢ్ భవన్‌లో లైజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిశ్రాను నోడల్ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని చత్తీస్‌గఢ్ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను నోడల్ అధికారి అందిస్తారని, ఈ మేరకు ఉక్రెయిన్ ప్రభుత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని తెలియజేసింది. హెల్ప్‌లైన్ నెంబర్లు: 01146156000, ఫ్యాక్స్-01146156030, మొబైల్ 9997060999

Advertisement

తాజా వార్తలు

Advertisement