నివారణ చర్యలు చేపట్టకుంటే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారిగా మార్పు చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు వ్యాప్తి చెందకుండా ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ సంక్షోభంగా మారకుండా అడ్డుకోవాలని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఈ వైరస్ రూపాంతరం చెందుతున్నా.. అడ్డుకట్టవేయాలనే మన సంకల్పం మాత్రం దృఢంగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ తేలికపాటిదేనని ప్రాధమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడే నిర్థారణకు రాలేమని అన్నారు.
ఒమిక్రాన్ లక్షణాలు, అన్ని దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరు, అతి పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలు కలిగి ఉండటంతో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సూచిస్తోందని టెడ్రోస్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యాక్సిన్ మూడో డోసు అవసరమని అధ్యయనాలు సూచిస్తున్నాయని ఫైజర్, బయోటెక్ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బూస్టర్ డోసులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వారి విశ్లేషణలు పేర్కొంటున్నాయి. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను కొద్ది కాలం పాటు బూస్టర్ డోసులను నిలిపివేయాల్సి వుందని డబ్ల్యుహెచ్ఒ వాదిస్తోంది. అయితే ఒమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు బూస్టర్ డోస్ అవసరమని శాస్త్రవేత్తలు నిర్థారిస్తుండటంతో పలుదేశాలు ఆ దిశగా అడుగులు వేసే అవకాశాలు కూడా లేకపోవచ్చని తెలుస్తోంది.