Friday, November 22, 2024

Exclusive: అగ్నిప‌థ్‌లో చేరొద్దు, ఇది మ‌హోద్య‌మంగా మారాలి.. యువ‌త‌కు మావోయిస్టుల‌ పిలుపు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ సిద్ధాంతం.. వారి భావజాల శిక్షణకు ఈ రకంగా ‘నయా భారత్’ పేరుతో దేశాన్ని ‘హిందూ రాజ్యం’గా రూపొందించే ఎజెండాకు అగ్నిప‌థ్‌ పథకం తోడు కాబోతోంద‌ని మావోయిస్ట్ పార్టీ నేత, కేంద్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి అభ‌య్ ఒక లేఖ‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌కు ఓ లెట‌ర్ రిలీజ్ చేశారు. దాంట్లో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను, చేస్తున్న దుర్మార్గ‌పు పాల‌న‌ను ఎండ‌గ‌ట్టారు.

‘వన్ నేషన్, వన్ ఎవ్రీథింగ్’ అన్న నినాదంతో దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్ధతిలో రూపొందించేందుకు, దేశంలో కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి వంటి పీడిత వర్గాలను.. వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీని, విప్లవకారులను, ప్రశ్నించే ప్రతి గొంతునూ అణచివేసేందుకు ఒక విస్తృత సైన్యం తయారవబోతుంద‌న్నారు. ఇప్పుడీ పథ‌కం దేశాన్ని ‘వన్ నేషన్, వన్ పోలీస్’ దిశగా తీసుకుపోతుంద‌ని ఆరోపించారు అభ‌య్‌.

అత్యంత దూకుడుగా తమ ఎజెండాను ముందుకు తీసుకువెళుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు దేశ రాజ్యాంగ నియమాలను కానీ, పార్లమెంటరీ వ్యవస్థ నిబంధనలను గానీ పాటించ‌డం లేద‌న్నారు మావోయిస్టు లీడ‌ర్ అభ‌య్‌. కనీస గణతంత్ర స్వభావాన్ని దృష్టిలోకి తీసుకోకుండా.. ప్రతిపక్షాలను సంప్రతించకుండానే పథకాన్ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. దీని వల్ల కేంద్ర, రాష్ట్రాల మ‌ధ్య‌ సంబంధాలు ప్రభావితం అవుతాయన్నారు.

ఇక‌.. ఈ ఫాసిష్టీకరణ పథకం లోతులను అర్థం చేసుకుని దాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి, ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వెనక్కు తీసుకోవాల‌ని అభ‌య్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసననోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక మహా ఉద్యమంగా మ‌ల‌చాల‌ని పార్టీ కేంద్ర కమిటీ దేశ యావత్‌ పీడిత వర్గాలు, పీడిత సెక్షన్లు, పీడిత జాతులకు పిలుపునిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. దేశ ప్రజలకు వ్యతిరేకమైన ‘అగ్నిపథ్’లో చేరవద్దని దేశ యువతకు విజ్ఞప్తి చేశారు అభ‌య్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement