ప్రైవేట్ టీవీ చానెల్స్ ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్‌పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి కొన్ని టీవీ చానెల్స్ ప్రసారాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్లు, వ్యాఖ్యలు చేసిన కొన్ని టీవీ చానెల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురకలు వేసింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నవి మానుకోవాలని హితవు పలికింది.
‘ఇటీవలి కాలంలో అనేక శాటిలైట్ టీవీ చానెల్స్ వార్తా ఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదారి పట్టించేవిగా, సంచలనాత్మకంగా కవరేజీని ప్రసారం చేసినట్లుగా గుర్తించాం. సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగించడం, ఇతరుల మర్యాదను కించపరచడం, అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా, మతపరమైన వ్యక్తీకరణలు వంటివి ప్రోగ్రామ్ కోడ్‌తోపాటు ది కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై టీవీ చానెళ్ల కవరేజీని కేంద్రం ఈ మేరకు ఉదాహరించింది. అంతర్జాతీయ ఏజెన్సీలు, ప్రముఖులను తప్పుగా ఉటంకించడం గమనించాం. వార్తాంశాలతో పూర్తిగా సంబంధం లేని ‘స్కాండలస్ హెడ్‌లైన్‌లు, ట్యాగ్‌లైన్‌లను’ ఉపయోగిస్తున్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలా మంది జర్నలిస్టులు, టీవీ యాంకర్లు వీక్షకులను రెచ్చగొట్టేలా కల్పితంగా, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్న వీటిని మానుకోవాలని, జాగ్రత్త వహించాలని ఒక ప్రకటనలో గట్టిగా సూచించింది.