కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎస్పీ అధినేత అఖిలేస్ యాదవ్, , సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీలోని దీనదయాళ్ మార్గ్‌లో డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన సోనియా గాంధీ.. అక్కడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలతో ముచ్చటించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నాయకులతో పాటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కూడా సోనియా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో డీఎంకే కార్యాలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, టీఎంసీ, టీడీపీ, సీపీఐ, బీజేడీ, ఎస్‌ఏడీ.. పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యారు. టీఎంసీ నుంచి మహువా మోయిత్రా, టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, సీపీఐ నుంచి డి రాజా, బీజేడీ నుంచి అమర్ పట్నాయక్, ఎస్‌ఏడీ నుంచి Harsimrat Badal.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.తమిళనాడు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, డీఎంకే ఎంపీలు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులను స్టాలిన్ శాలువలతో సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఆ తర్వాత సోనియా గాంధీ, ఇతర పార్టీల నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేశారు.