దివాళి డే యాక్ట్ పేరిట కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ అమెరికాలోని ప్రతినిధుల సభలో బిల్లుని ప్రవేశపెట్టారు.దాంతో దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తమయింది. ప్రపంచంలోని కోట్లాది మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను అని ఆమె తెలిపారు. ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం.
ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు అని కొనియాడారు. న్యూయార్క్ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. దీపావళిని సెలవుగా ప్రకటిస్తే ఈ పండుగ నిర్వహించుకునే వారిని గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా, అమెరికన్లకు పెద్ద సంప్రదాయానికి ప్రచారం కల్పించినట్టు అవుతుందన్నారు. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు. దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త హాలిడేగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ తెలిపారు.