హైదరాబాద్, ఆంధ్రప్రభ: బీజేపీలో అసంతృప్తి సెగ రాజుకుంటోంది. ఇచ్చిన బాధ్యతల నుంచి తమను తప్పించాలని నేతలు మొరపెట్టుకుంటున్నారు. తమకు తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని, ఈ బాధ్యతలు తమకొద్దంటూ తేల్చేస్తున్నారు. అసెంబ్లి ఎన్నికలకు ఇంకా 10 నెలలే సమయం ఉండడంతో తమ నియోజకవర్గంలో తాము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలతో మమేకమవుతామని మొరపెట్టుకుంటున్నారు. అసెంబ్లి నియోజకవగర్గాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తమను తప్పించాలంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌ను కొందరు నేతలు కోరినట్లు తెలిసింది. అయితే పోలింగ్ బూత్‌కమిటీలు వేసే బాధ్యత అసెంబ్లి ఇంఛార్జీలదేనని, దానికనుగుణంగానే పని చేయాలని వారికి తరుణ్ చుగ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాల్సిందేనని.. లేకుంటే పార్టీ నుంచి తప్పిస్తామని హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో నేతలకు తరుణ్ చుగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాకొద్దు ఆ ఇంచార్జ్ బాధ్యతలు అంటూ పలువురు అసెంబ్లిd ఇంఛార్జీలు సమావేశంలో చేతులెత్తేసినట్లు సమాచారం. తమ నియోజికవర్గాల్లో తాము పనిచేసుకుంటామని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలోచనలో ఉన్నట్లు వారి ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తమతమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చే ఎన్నికల క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటామని కొందరు ఇంఛార్జీలు పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
మేమూ పోటీకి సిద్ధం…
రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు 2023 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణను మొదలుపెట్టేశారు. ఎన్నికల బాణాలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే ఈనెల 20 నుంచి బీజేపీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నేడు కూడా జరగనున్నాయి. నేడు చివరి రోజు కావడంతో పార్టీ కార్యవర్గ సమావేశం కానుంది. ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రోడ్ మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ఇంతలోనే పార్టీ పెద్దలకు ఇంఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే తమకి ఎక్కడో మారుమూల జిల్లాలకు ఇంఛార్జీలుగా ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ జిల్లాకు కేటాయిస్తే స్థానికంగా ఉంటూ తాము పోటీ చేయాలనుకునే నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచుకుంటామని అంటున్నారు.
ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఒక నేతకు తీసుకోపోయి ఎక్కడో ఆదిలాబాద్, కరింనగర్‌కు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంఛార్జీలుగా బాధ్యతలు అప్పగించినప్పుడే వీరికి పోటీ చేసేందుకు అవకాశం ఉండదని అసెంబ్లి నియోజకవర్గ ఇంఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలను బీజేపీ పెద్దలు ఇచ్చారు. అప్పుడు కూడా కొంత మంది నేతలు దీన్ని తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పోటీ చేసేందుకు ఆశవాహులు ముందుకు వస్తున్నారు. తామూ పోటీకి సిద్ధం అవుతామని పార్టీ పెద్దలకు చెప్పారని తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇంఛార్జ్ బాధ్యతలు వద్దని అసంతృప్తి వ్యక్తం చేశారట. తమ నియోజకవర్గంలో పనిచేసుకుంటామని, కమిటీలు వేసుకుంటామని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే వీరి ప్రతిపాదనను రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అదేసమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నవారిని అసెంబ్లి నియోజకవర్గాల్లో ఇంఛార్జీలుగా పెట్టాలా? లేక వీరినే కొనసాగించాలా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ప్రస్తుతం తమ పార్టీలోని అసెంబ్లి ఇంఛార్జీల అంశం తలనొప్పిగా మారిందనే చర్చ పొలిటికల్ సర్కిల్‌ల్లో చక్కర్లు కొడుతోంది.